మొత్తానికి దక్షిణాది రాష్ట్రాలలో మరోసారి సినీ తారల రాజకీయ ప్రవేశాలు జోరందుకున్నాయి. తెలుగు నాట పవన్ కళ్యాణ్ జనసేన ప్రత్యక్ష పాత్రకోసం పార్టీ కార్యాలయాలు ప్రారంభించి కార్యకర్తలనూ చేర్చుకుంటున్నది. తమిళనాడులో ఇద్దరు సూపర్ స్టార్లు కమల్ హాసన్, రజనీకాంత్‌లు రాజకీయాల్లో దూకేందుకు సూచనలు వదులుతూ సమాలోచనలు చేస్తున్నారు. కమల్ ధృవీకరించక రజని ఎప్పటిలాగే సాగదీస్తున్నారు. వారి ముచ్చట తేలేలోగానే ఇప్పుడు కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర రాజకీయ పార్టీని స్థాపించేశాడు. ఎందుకంటే తమిళనాడు కంటే కర్ణాటకలో బాగా ముందే ఎన్నికలు వచ్చేస్తాయి మరి! ప్రజ్ఞావంత ప్రజా పక్ష జనతా పార్టీగా ఆయన నామకరణం చేశారు. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తానని ప్రకటించారు. మరి ఈ లోగా ఉపేంద్రతో చర్చలకు ఏ పార్టీ అయినా ముందుకొస్తుందా? వస్తే ఆయన ఒప్పుకుంటారా? ఆయన చెప్పిన ప్రజా సంక్షేమ చర్యలు బాగానే వున్నా కొత్తవేమీ కాదు. ఇప్పటికే కాంగ్రెస్ బిజెపి హెరాహౌరి తలపడుతుంటే ఈ కొత్త హీరో ప్రవేశం ఎలాటి ప్రభావం కనబరుస్తుందో చూడాలి మరి. కాకుంటే దీనివల్ల ఇతర చోట్ల కూడా సినిమా వారికి ఉత్సాహం పెరగొచ్చు.