ఇదేమిటీ కొత్త వివాదం అనుకుంటున్నారా? వివాదం కాదు. ఇది అసెంబ్లీ లాబీలో చోటు చేసుకున్న ఓ ఆసక్తికర సంవాదం. బుధవారం ఓ టీడీపీ, ఓ టీఆర్ ఎస్ ఎమ్మెల్యే మధ్య నడచింది.
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి నిఖార్సైన ఎమ్మెల్యేగా మిగిలిన ఏకైక అచ్చమైన సభ్యుడు సండ్ర వెంకట వీరయ్య బుధవారం అసెంబ్లీకి వచ్చారు. మొత్తం 15మందికి గాను మిగిలిన ఒకే ఒక్కడు కాబట్టి (ఆర్.కృష్ణయ్య కూడా ఉన్నప్పటికీ… ఆయన పూర్తిగా తమ పార్టీతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే) సహజంగానే ఆయన కాస్త సెంట్రాఫ్ అట్రాక్షన్ అయ్యారు.
ఈ నేపధ్యంలో పలువురు నేతలు సండ్రతో మాటలు కలిపారు. ఆయనతో కాసేపు ముచ్చట్లు పెట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాలరాజు… ఆయన్ను టీ ఆర్ ఎస్ పార్టీలోకి రమ్మంటూ ఆహ్వానించారు. అయితే తన వల్ల కాదంటూ సండ్ర తిరస్కరించారు. దీనిపై రెట్టించి అడిగినప్పుడు బదులుగా… దొరల ఏలుబడిలో తాను ఉండలేనన్నారు సండ్ర. పరోక్షంగా కెసియార్ను ఉధ్ధేశ్యించి సండ్ర ఈ వ్యాఖ్యలు చేయడంతో బాలరాజు వెంటనే… తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీయార్ కూడా దొరే కదా అని గుర్తు చేశారు.
దీనికి స్పందించిన సండ్ర… ఎన్టీయార్ మనిషి దొర అయినా మనసు బడుగుల పక్షమే అన్నారు. అయితే ఎంత బడుగుల పక్షం అయినా ఎన్టీయార్ కన్నా ప్రస్తుతం తమ ముఖ్యమంత్రి కెసియార్ అందరు సిఎంల కంటే అధికంగా బడుగుల సంక్షేమం కోసం పధకాలు అమలు చేస్తున్నారంటూ చెప్పారు. ఎన్టీయార్, కెసియార్ ఇద్దరూ దొరలే అని చివరకు తేలుస్తూ ఈ నేతలిద్దరి మధ్య నడచిన సంవాదాన్ని పలువురు ఆసక్తికరంగా గమనించారు.