తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మాటకారి కావచ్చు, ప్రత్యర్థుల నోళ్లు మూయించడంలో ఆరితేరి వుండొచ్చు. నూతన సచివాలయం కట్టాలని ఆయన నిర్ణయించుకోవచ్చు కూడా. అంత మాత్రాన అరవై ఏళ్లుగా వున్న పాలనా కేంద్రాన్ని చెత్త అని ఈసడించాల్సిన అవసరం వుందా? కొత్త రాష్ట్రం కొత్త భవనాలు కట్టుకుందామని మోజు వుండొచ్చు గాని ప్రాధాన్యతల ప్రశ్న వేసుకోవాల్సి వుంటుంది. నిజంగానే కొత్త నిర్మాణం చేపట్టినా అది పూర్తయ్యేవరకూ పాతది పాడు పెట్టరు. దానిపై శాపనార్థాలు పెట్టరు. అక్కడకు రాకుండా బహిష్కరించినట్టు వ్యవహరించరు. కాని కెసిఆర్ చేసింది చేస్తున్నదీ అదే. పాలనా కేంద్రం విలువను తనే తగ్గించేశారు.ఆయన రాకపోవడంతో మంత్రులు కొందరు అధికారులు మరికొందరు సచివాలయాన్ని చిన్నచూపు చూడటం మొదలెట్టారు.
అదే సమయంలో ముఖ్యమంత్రి మనసులో మరో మాట వుందని సన్నిహితులు చెబుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్కు రాజధాని లేదు గనక కొత్త భవనాలు వస్తాయి. అది కూడా కృష్ణాతీరంలో అరుదైన నదీ తీర రాజధానిగా వుంటుంది. ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు గాని కొత్తగా వుంటుంది. కొన్నేళ్ల తర్వాత ప్రజలు చూస్తే పొరుగి రాజధాని భవనాలు కొత్తగా కళకళలాడుతుంటగి ఇక్కడ కూలిపోతున్న పాతవాటిలో ప్రయాసపడాల్సిన అవసరమేముందని ఆయన అనుకుంటున్నారట. హైదరాబాదు అనేక ఘనతలు వున్నానదీ తీరం లేదు. ఆ లోటు తీర్చడానికి హుసేన్ సాగర్ తీరాన గొప్ప నిర్మాణాలు చేయాలని ఆలోచిస్తున్నారట. సచివాలయం ఖాళీ అయ్యాక అక్కడ ఆకర్షణీయమైన భవనాలు నిర్మించి హుస్సేన్ సాగర్ను కూడా ప్రక్షాళన చేస్తే ప్రజలకు ఆహ్లాదంగానూ అందంగానూ వుంటుందని ఆయన చిరకాలంగా ప్రణాళిక వేసుకుంటున్నట్టు దగ్గరగా వుండే ప్రజా ప్రతినిధి ఒకరు చెప్పారు. ఇవన్నీ నిజమే కావచ్చు గాని అందుకోసం వారసత్వ భవనాలను కూల్చడం, అన్నిటినీ ఒకేసారి పునర్నిర్మించడం అవాస్తవికత అవుతుంది. తర్వాత మరేదైనా ప్రభుత్వం వస్తే ఇలాగే ఉపయోగిస్తారని లేదు. ఎందుకంటే కరుణానిధి హయాంలో కట్టిన నూతన సచివాలయాన్ని జయలలిత ప్రారంభించనే లేదు. ఆస్పత్రిగా మార్చేశారు. కనుక ప్రభుత్వాల మార్పును బట్టి ప్రజాధనంతో చేసే నిర్మాణాలన్నీ మారాలంటే చాలా కష్టం. అనుచితంకూడా.