వైఎస్ఆర్సిపి అధినేత ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ తన పాదయాత్ర సందర్భంగా టీవీ ఛానళ్లు పత్రికల నిర్వాహకులతోనూ, సీనియర్లతోనూ మూడు నాలుగు దఫాలుగా భేటీ అయ్యారు. ప్రశాంత్ కిశోర్ బృంద సభ్యులు కూడా వీటిని పరిశీలిస్తున్నారు. ఈ కసరత్తుపై సోషల్ మీడియాలో రకరకాలుగా కథనాలు వస్తున్నాయి. మీడియాధిపతుల కోసం దిగివచ్చారని కొందరు, పిలవని వాళ్లను అవమానించారని కొందరు రాస్తున్నారు. అలా అనుకోవాల్సిన అవసరం లేదు గాని ఆయన మామూలుగా జరిపే మీడియా గోష్టులు కాకుండా విడిగా ఇంత పెద్ద కసరత్తు జరపడం ఇదే మొదటి సారి కావచ్చు. ఇది ఆరోగ్యకరమైంది కూడా. అసెంబ్లీలోనూ వైసీపీ కేంద్ర కార్యాలయంలోనూ జగన్ మీడియా గోష్టులు జరిపినప్పుడు విలేకరులను పేర్లతో సహా గుర్తు పెట్టుకుని మాట్లాడుతుంటారు. కాని ఎడిటర్ల స్థాయిలో కలిసింది లేదు. ఇప్పటి వరకూ ఇంగ్లీషు మీడియాతోనే ఇష్టాగోష్టులు ఇంటర్వ్యూలు జరిపే జగన్ తెలుగుమీడియాతోనూ సంబంధాలు పెంచుకోవడం పట్ల ఆ సమావేశంలో ఒక మాజీ సంపాదకుడు ఆ సమావేశంలో సంతోషం వెలిబుచ్చారు. రామోజీగారిని కూడా వెళ్లి కలసి వచ్చాను కదన్నాఅంటూ జగన్ స్పందించారు. అయితే తెలుగు మీడియా సంస్థలు తమకు సంబంధించిన అంశాలను తగినంతగా ప్రతిబింబించడం లేదన్న బాధ ఆయనలో వుంది. ఈ కారణంగానే తమ పార్టీ చేస్తున్న కృషి కూడా ప్రజలకు తెలియకుండా పోతుందనే భావన వుంది. ఈ పాదయాత్రకైనా మీడియా తగు సహకారం అందించాలనే ఆకాంక్ష వుంది. పాదయాత్రలో చాలా విస్త్రతంగా ప్రజలను కలుసుకోవాలని వారి మనోభావాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ప్రత్యేక హౌదా విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని కూడా జగన్ చెబుతున్నారు. హౌదా ఇచ్చేట్టయితే బిజెపికి సహకరిస్తామనీ అందుకోసం అవసరమైతే తన ఓటర్లకు నచ్చజెప్పుకుంటామని కూడా ఆయన అంటున్నారు. మీడియాతో ఇష్టాగోష్టి అవగాహన కోసం తప్ప బయిట రాయడానికి చెప్పడానికి కాదని ఆ పార్టీ భావించినందువల్లనే బహుశా నాతో సహా ఎవరూ ఆ విషయాలు వెల్లడించడం లేదు. ముందు ముందు వచ్చేకథనాలను బట్టి పరిస్థితులను బట్టి ఆ భేటీలోని ఆసక్తికరమైన అంశాలు కొన్ని చెప్పుకోవచ్చు. ఈలోగా ఎంచుకున్న ఛానళ్లలోనూ పత్రికలలోనూ ఇంటర్వ్యూలు ఇవ్వడానికి జగన్ సిద్ధమవుతున్నారట.