ఒక్కసారి, నంద్యాల ఉప ఎన్నికలు ఫలితాలు వెలువడ్డాక పరిస్థితిని గుర్తు చేసుకుందాం! సెమీ ఫైనల్స్ అంటూ బరిలోకి దిగిన ప్రతిపక్షం భంగపడింది. వైకాపా ఓటమికి గల కారణాలు విశ్లేషించుకుంటే అతి విశ్వాసం అనేది కొందరు అంగీకరించారు. దీనికితోడు భూమా అఖిల ప్రియను ఉద్దేశించి ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలు కూడా టీడీపీ మెజారిటీ పెంచేందుకు దోహనం అయ్యాయనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. దాంతో వైకాపా అధినాయకత్వం ఆమె మాట తీరుపై కాస్త ఆగ్రహించిందనీ, రోజా కొన్నాళ్లు చిన్నబుచ్చుకున్నారనీ కథనాలు వచ్చాయి. సరే, కొద్దిరోజుల విరామం తరువాత మళ్లీ రోజా ఫామ్ లోకి వచ్చేశారు. ఇప్పుడు జగన్ పాదయాత్ర మొదలు కాబోతోంది. ఈ నేపథ్యంలో రోజా మాట్లాడారు. అంటే, పాదయాత్ర తీరు తెన్నులూ దాని విధివిధానాల కంటే, ఈ సందర్భాన్ని కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబును తిట్టిపోసేందుకు ఎక్కువ సమయం కేటాయించడం గమనార్హం!
మహాత్మా గాంధీ దండియాత్రకు బయలుదేరితే బ్రిటిష్ వారు భయపడ్డట్టు, జగన్ ఓదార్పు యాత్రకు వెళ్తుంటే సోనియా భయపడ్డట్టు, ఇప్పుడు పాదయాత్ర అనగానే కౌంట్ డౌన్ మొదలైందని చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడు అని రోజా విమర్శించారు. యాత్రను అడ్డుకోవడం కోసం అధికార బలంతో కుట్రలు చేస్తున్నాడు అన్నారు. కుట్రలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరయ్యా అంటే చంద్రబాబు అని చెప్పాలన్నారు. ఏ మనిషికైనా ఒంట్లో రక్తం ప్రవహిస్తుంటే.. చంద్రబాబు నాయుడుకి నరనరానా కుట్రలూ కుతంత్రాలు ప్రవహిస్తుంటాయన్నారు. ఆ కుట్రలు ఎలా ఉంటాయో ఆయన కుటుంబ సభ్యులే గతంలో స్వయంగా చెప్పారన్నారు. జగన్ పాదయాత్ర నేపథ్యంలో విధ్వంసం సృష్టించడం కోసం ఆయన కుట్ర చేస్తున్నారనీ, దీన్ని పోలీసు అధికారులూ ప్రజలూ తిప్పికొట్టాలని కోరారు. జగన్ ను ఎదుర్కోలేక చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకున్నది నువ్వు కాదా, కుమారుడు లోకేష్ తో కలిసి దాదాపు మూడున్నర లక్షల కోట్లు అవినీతి చేసింది నువ్వు కాదా, ఎర్ర చందనం స్మగ్లర్ల పేరుతో అమాయకుల్ని చంపించింది నువ్వు కాదా, సోనియాతో కలిసి జగన్ పై అక్రమ కేసులు పెట్టించింది నువ్వు కాదా, తుని ఘటన వెనక అసలైన కుట్ర చేసింది నువ్వు కాదా…ఇలా చాలా అంశాలను ప్రస్థావిస్తూ చంద్రబాబును నాయుడుపై విమర్శలు చేశారు.
విమర్శలు చేయడం సమస్య కాదుగానీ… ఇలా విరుచుకుపడటానికి ఇది సందర్భమా అనేదే ప్రశ్న..? ఓపక్క జగన్ పాదయాత్రకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పోలీసుల అనుమతి ఉందా లేదా అనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇది ప్రభుత్వం కుట్రే అని విమర్శించొచ్చు. ఈ అంశానికే పరిమితమైతే బాగుండేది. అంతేగానీ.. ఇక్కడ మొదలుపెట్టి మళ్లీ ఎక్కడికో వెళ్లిపోవడం రోజాకి అలవాటుగా వస్తున్న ప్రసంగ ధోరణి! ఈ తీరు వల్లనే నంద్యాల ఉప ఎన్నికల సందర్భంలో సొంత పార్టీ నుంచే విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు పాదయాత్ర గురించి మాత్రమే మాట్లాడేందుకు పరిమితమైతే బాగుండేది. పాదయాత్ర చేయడం ద్వారా జగన్ చేస్తున్న పోరాటం గురించి మాట్లాడితే సందర్భోచితంగా ఉండేది. ఈ సందర్భంలో వైకాపా నేతలు ఎవ్వరు మాట్లాడినా జగన్ పాదయాత్ర ప్రాధాన్యత పెంచే విధంగా ఉండాలి. అంతేగానీ, చంద్రబాబును విమర్శించడమే ప్రతీసారీ పనిగా పెట్టుకుంటే ఎలా..? ఒకసారి దెబ్బతిన్నా కూడా రోజా టాపిక్ మారడం లేదు అనే అభిప్రాయాలకి ఆమె ఆస్కారం ఇస్తున్నారు.