రేవంత్‌రెడ్డి చేరిక తర్వాత పరిస్థితిపై కాంగ్రెస్ నాయకుల మాటలు రెండు రకాలుగా వుంటున్నాయి. మీడియాతో మాట్లాడేప్పుడు గంభీరంగానూ ఆయనను సమర్థించే విధంగానూ మాట్లాడుతున్నారు. ఆయన రాక పెద్ద రాజకీయ పరిణామమన్నట్టు చిత్రిస్తున్నారు. కాని మామూలు సంభాషణల్లో మాత్రం తమ అధిష్టానం ఆయనకు అమిత ప్రాధాన్యత నిస్తున్నదని ఫిర్యాదు చేస్తున్నారు. రేవంత్ బాహుబలి అని తామెవరం అనలేదనీ, మీడియాలో ఆయన అనుకూలులైన వారే దాన్ని ప్రచారంలో పెట్టారని ఒక ఎంఎల్ఎ వ్యాఖ్యానించారు. మా పార్టీలో అందరూ బాహుబలులేనంటూ రేవంత్‌ను పరోక్షంగా తగ్గించేందుకు మరో ఎంఎల్ఎ ప్రయత్నించారు. ఇక టిఆర్ఎస్ నాయకులైతే ఆయనపై ఒంటికాలిమీద దాడి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా సత్యం రామలింగరాజు తనయుడితో కెటిఆర్ వున్నట్టు ఫోటోను రేవంత్ ట్వీట్ చేసిన తర్వాత వారి దాడి మరీ పెరిగింది.అయితే ఈ ఫోటో విడుదల చేయడం, ఇంకేదో సంచలనం వున్నట్టు వూరించడం రేవంత్ గతంలోనూ అనుసరించిన టెక్నిక్కే. దీన్నిబట్టి ఆయన దగ్గర ఇంకా ఏదో చాలా సమాచారం వున్నట్టు అనుకోవాల్సిన అవసరం లేదు.నిజంగా అలాటివి బయిటపెడితే తప్ప. ఎందుకంటే వున్నదాన్ని వివాదాస్పదం చేయడంలో రేవంత్ దిట్ట. అచ్చంగా ఆయన ద్వారానే బయిటకు వచ్చిన విషయాలు తక్కువే. ఆ విధంగా శాసనసభలో సవాలు చేసిన విషయంలో రేవంత్ పెద్దగా నిరూపించింది లేదు. ఆ సాకుతోనే ఆయనను సస్పెండ్ చేశారు. అలా చేయడం తప్పు గాని ఆయన సవాలు అందుకోలేకపోయిన మాట కూడా నిజం. మరి ఇప్పుడైనా తన దగ్గర నిజంగా అన్ని సంచలనాలు వున్నాయా?వూరికే హడలగొడుతున్నారా? ఇవన్నీ ఒక ఎత్తయితే ముందు తన రాజీనామాపై ఆయన పట్టుపడతారా అన్నది కూడా ప్రశ్నగానే వుంది.