ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు. కేంద్రమంత్రులు నితిన్ గట్కరీ, రాజనాథ్ సింగ్ లతో భేటీ అయ్యారు. ఆ తరువాత, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో ఫోన్లో మాట్లాడారు. రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ప్రాజెక్టుల నిధుల గురించీ, విభజన చట్టంలో ఉన్న అంశాల అమలు గురించి కేంద్రానికి నివేదించారు. అయితే, ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే… ఏపీకి సంబంధించిన అత్యంత కీలకమైన అంశాల విషయమై ఆయన ఢిల్లీకి వెళ్లి, మంత్రులను కలుసుకున్నారుగానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అనే ప్రస్థావన రానేరాలేదు. ప్రధానిని కలిసే ప్రయత్నం చేసినట్టుగానీ, లేదంటే రాష్ట్రానికి సంబంధించిన డిమాండ్లను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టుగానీ చంద్రబాబు కూడా ఎక్కడా మాట్లాడకపోవడం విశేషం!
నిజానికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగతంగా భేటీ అయి దాదాపు ఏడాదిన్నర అవుతోంది. ఇదే అంశమై పలువురు నేతలు విమర్శలు చేసిన సందర్భాలూ చాలానే ఉన్నాయి. ఇంతకీ, సీనియర్ నాయకుడైన చంద్రబాబుకి ప్రధానమంత్రి సమయం నిజంగానే ఇవ్వడం లేదా..? లేదంటే, చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన ప్రతీసారీ, అపాయింట్మెంట్ కోరిన ప్రతీసారీ మోడీని కలుసుకోలేని పరిస్థితులు కాకతాళీయంగా వస్తున్నాయా..? ఎన్డీయేలో భాజపా తరువాత భాగస్వామిగా ఉన్న ప్రధాన పార్టీ అధినేత అయిన చంద్రబాబు నాయుడుకి ఇలాంటి పరిస్థితి ఎందుకు ఎదురౌతోంది..? ప్రధానితో ముఖాముఖి భేటీ కోసం ఇటీవల ఓ నాలుగుసార్లు చంద్రబాబు ప్రయత్నించారనీ, కానీ మోడీ సమయం ఇవ్వలేదని కూడా టీడీపీ నేతలే చెబుతూ వస్తున్నారు.
నిజానికి, భాజపా తీరుపై ఏపీ టీడీపీలో కూడా ఒకింత గుర్రుగానే పరిస్థితి ఉంది. కానీ, రాష్ట్రానికి కేంద్రం అందించాల్సిన సాయం చాలానే ఉంది కాబట్టి, కొంతమంది టీడీపీ నేతలు భాజపా విషయమై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా.. కేంద్రంతో పంతానికి వెళ్లకూడదనే ధోరణిలోనే చంద్రబాబు వారిని కాస్త తగ్గిస్తూ వస్తున్నారు. ఏదేమైనా, భాజపా – టీడీపీ సంబంధాల డొల్లతనం మరింత బహిర్గతం అవుతున్న సంకేతాలు ఇవి! ఇంతకీ.. చంద్రబాబు నాయుడుకి ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వకూడని కారణాలు ఏముంటాయి..? పోనీ, చంద్రబాబు కోణం నుంచి ఆలోచించినా భాజపాతో పంతానికి పోయే పరిస్థితులు లేవు. అలాంటప్పుడు, ప్రతీసారీ ఇలానే ఎందుకు జరుగుతోంది..? ఈ చర్చ రాజకీయ వర్గాల్లో మరోసారి వినిపిస్తోంది. దీనిపై చంద్రబాబు ఏదో ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేయాలి. లేదంటే, భాజపా టీడీపీల మధ్య పెరుగుతున్న దూరాన్నే ప్రజలు చూస్తారు. ఏదేమైనా, ఏడాదిన్నరగా మోడీ – చంద్రబాబు భేటీ సాధ్యం కాలేదన్నది చిన్న విషయంగా చూడలేం కదా!