అధికారంలోకి రావాలంటే నాయకుల పనితీరు బాగుండాలి! కానీ, ఈ మధ్య రకరకాల నమ్మకాలను రాజకీయ పార్టీలు అనుసరిస్తున్నాయి. ఫలానా చోట సభ పెడితే అధికారంలోకి వచ్చేస్తామనీ, ఫలానా చోట పాదయాత్ర మొదలుపెడితే ఎన్నికల్లో గెలిచేస్తామనే విశ్వాసాలు కాస్త ఎక్కువైపోయాయి. తెలంగాణ విషయంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఓ కొత్త సెంటిమెంట్ ను తెరమీదికి తెస్తోంది. సెంటిమెంట్ అంటే రాష్ట్రాన్ని తామే ఇచ్చామన్న అంశం కాదులెండి! నిజానికి, కాంగ్రెస్ హయాంలో తెలంగాణ వచ్చినా.. ఇచ్చిన క్రెడిట్ ని పార్టీ దక్కించుకోలేకపోయింది. ఇప్పుడు కొత్తగా ఫాలో అవుతున్న నమ్మకం ఏంటంటే… తెలంగాణతోపాటు దేశంలో అధికారంలోకి రావాలంటే రాష్ట్రంలోని ఓ రెండుచోట్ల సభలు నిర్వహించాలనే నమ్మకాన్ని రాష్ట్ర నేతలు రాహుల్ గాంధీకి చెప్పినట్టు తెలుస్తోంది. దాని ప్రకారమే త్వరలోనే రాహుల్ రాష్ట్రానికి రాబోతున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది. వరంగల్ లో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నట్టు పార్టీ తెలిపింది.
ఓ మూడు నెలల కిందట సంగారెడ్డిలో రాహుల్ గాంధీతో ఒక సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈనెలలో వరంగల్ లో సభ నిర్వహించేందుకు పీసీసీ ఏర్పాట్లు చేస్తోంది. నిజానికి, ఈ సభను మొదట మెహబుబాబాద్ లో పెట్టాలని అనుకున్నారు. కానీ, సీనియర్ల సలహా మేరకు వేదికను వరంగల్ మార్చారు. ఆ సలహాలో ఉన్న సెంటిమెంట్ ఏంటంటే… 2003లో సోనియా గాంధీ ఇక్కడే సభ నిర్వహించారు. ఆ తరువాత, కాంగ్రెస్ పార్టీ పదేళ్లపాటు దేశంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో కొనసాగింది. అందుకే, వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ ను సెంటిమెంట్ గా రాహుల్ కి చూపిస్తున్నారు! అంతేకాదు, సంగారెడ్డి సభకు కూడా మరో నమ్మకం యాడ్ చేశారు. అప్పట్లో ఇక్కడ ఇందిరా గాంధీ భారీ సభను నిర్వహించారు. ఆ తరువాత, పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నిక కావడం, ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది! సో.. ఆ రకంగా తెలంగాణలో రాహుల్ కు రెండు రకాల సెంటిమెంట్లు ఉన్నట్టు అయింది.
ఈ నెల 20న వరంగల్ లో ఈ సభ జరుగుతుంది. ఈలోగా రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం ఉందని రాష్ట్ర నేతలు చెబుతున్నారు. అదే జరిగితే అధినేత హోదాలో తొలిసారిగా రాహుల్ తెలంగాణకి వస్తారని నమ్మకంగా చెబుతున్నారు. రాహుల్ వచ్చేలోగా భారీ ఎత్తున పార్టీలో చేరికపై దృష్టి పెడుతున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డి కూడా పార్టీలో చేరడంతో కొత్త జోష్ లో నేతలు ఉన్నారు. వరంగల్ బహిరంగ సభను భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయిగానీ.. రాహుల్ ఫాలో అవుతున్న ఈ సభల సెంటిమెంట్లు ఎంతవరకూ వర్కౌట్ అవుతాయో చూడాలి!