బిహార్ ఎన్నికల బరిలోకి పురాణపాత్రలనీ, హిస్టరీలోని ఆశోకుడని కూడా లాక్కొచ్చేశారు. మరో పక్క రాజ్యాధికారం ఎవరికి అప్పగించాలన్న తీర్పును మహిళలకే అప్పగించడం 2015 బిహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మరో విశేషం.
బిహార్ రాష్ట్రం ఇతిహాసకాలంలో జనకమహారాజు ఏలిన ప్రాంతం. అక్కడే సీతమ్మవారి పుట్టిన ప్రాంతం ఉంది. అంతేకాదు, సీతారాముల వివాహానంతరం వారికి కవలపిల్లలు పుట్టారు. యుగాలుమారినా, శతాబ్దాలు దొర్లినా ఆ నాటి లవకుశుల సంతాన పరంపర బిహార్ లోనే ఉన్నట్టు చెబుతుంటారు. సీతమ్మవారు భూగర్భంలో కలిసిపోయిన తర్వాత రామచంద్రుడు లవకుశులకు రాజ్యాలు అప్పగించాడు. చరిత్రకారులు చెబుతున్న లెక్కల ప్రకారం, కుశునికి కుశావాతీ పట్టణాన్ని, లవునికి లవ పట్టణాన్ని కట్టించి ఇచ్చాడు. ఈ లవ పట్టణాన్నే ఆ తర్వాతకాలంలో లాహోర్ గా ప్రసిద్ధమైంది. లాహోర్ కోటలో లవకు సంబంధించిన ఆలయం ఉందట. అయితే, ఇందుకు భిన్నంగా, బిహార్ లో మాత్రం ఇప్పటికీ వారి సంతతివారమని చెప్పుకునేవాళ్లున్నారు. కుర్మీలనే సామాజిక వర్గంవారు తాము లవుడి వంశస్థులమని చెప్పుకంటారు. బిహార్ జనాభాలో మూడుశాతం మంది ఈ సామాజికవర్గానికి చెందినవారే. ప్రస్తుత బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా ఈ వర్గానికి చెందినవారే. ఈయనకు యాదవులంటే గిట్టదు. అందుకే యాదవేతర వెనుకబడిన వర్గాలకు నాయకుడయ్యాడు. సరే, ఈ విషయం అటుంచితే, మరో వర్గం కొయిరీలు. వీరు పేర్ల చివర కుశ్వాహా అని తగిలించుకుంటారు. వీరు కుశుని సంతతికి చెందినవారని చెప్పుకుంటారు. బిహార్ జనాభాలో వీరిది 9శాతం. వీరికి ఉపేంద్ర కుశ్వాహా నాయకత్వం వహిస్తున్నారు. కొన్ని విషయాల్లో తేడాలున్నప్పటికీ కొయిరీలు, కుర్మీలు అన్నదమ్ముల్లా కలసిమెలసే ఉంటారు. అయితే కుళ్లు రాజకీయ ఫలితంగా వీరిమధ్య చిచ్చు మొదలైంది.
లవకుశులు క్షత్రియులు కారా ?
శ్రీరాముడు క్షత్రియుడు. సీతాదేవి క్షత్రియకన్య. మరి అలాంటప్పుడు వారిద్దరికి పుట్టిన సంతానం (లవకుశులు) క్షత్రియులు కాకుండా ఎలా పోతారు? దీనికి సమాధానం ఈ కులరాజకీయాలను నడుపుతున్న వారు తేల్చిచెప్పాలి. అయితే, యుగాలు గడిచేసరికి, ఓడలు బండ్లు అయినట్టు తమ సామాజికవర్గం మారినట్టుగా వారు భావించే వీలుంది. కనుక, కొన్ని వేలాది తరాల తర్వాత జరిగిన పరిణామంగా దీన్ని భావించవచ్చు.
లవకుశుల యుద్ధం
తాజా బిహార్ ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ ని ఎలా కంట్రోల్ చేయాలన్నదే భారతీయ జనతాపార్టీ వ్యూహం. బిజేపీ పన్నిన వ్యూహంలో ఉపేంద్ర కుశ్వాహా చిక్కుకుపోయారు. దీంతో ఆయన సొంతంగా పార్టీ (రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ – ఆర్ఎల్ఎస్పీ) స్థాపించారు. ఈ పార్టీకి రాజకీయలబ్ది కలిగేలా బీజేపీ వెన్నుదన్నుగా కొన్నేళ్లనుంచీ ఉంది. ఇక ఇప్పుడు బిజేపీ, జేడియూ వేరువేరు కూటమిలనుంచి పోటీచేస్తుండటంతో, రాబోయే ఎన్నికల్లో లవుడు, కుశుడు వర్గానికి చెందినవారు తమ చిరకాల చెలిమిని మరచిపోయి బాహాబాహీ పోరాటానికి దిగే సమయం వచ్చేసింది. అంటే బిహార్ ఎన్నికల పుణ్యమా కవలైన లవకుశల మధ్య (వారి వంశస్థుల మధ్య) యుద్దం పుట్టుకొచ్చింది. రామాయణంలో ఎక్కడా చదవని వింత ఇది.
అశోకుడ్ని దింపిన బిజేపీ
ఎలాగో కుశ్వాహాలను దగ్గరకుతీసి వారిచేత పార్టీ కూడా పెట్టించి కుర్మీలనుంచి వేరుచేసిన బిజేపీ కొద్దినెలల క్రిందటే మరో వ్యూహాన్ని తెరమీదకు తెచ్చింది. ఎప్పుడో 2300 సంవత్సరాల క్రిందట మౌర్యసామ్రాజ్యాన్ని ఏర్పాటుచేసిన చక్రవర్తి అశోకుడ్ని కూడా రంగంలోకి దింపింది. అశోకుడు మరెవరో కాదట, ఆయన సామాజిక వర్గం కూడా కుశ్వాహా అని తేల్చిచెప్పింది. కుశ్వాహాలు వెనుకబడిన వర్గానికి చెందినవారు. మరి అశోకుడేమో సంపన్నవర్గానికి చెందినవాడు. క్షత్రియుడైన అశోకుడు కుశ్వాహా వర్గానికి ఎలా చెందుతాడో తెలియక చరిత్రకారులు కూడా బుర్రలుబద్ధలుకొట్టుకోవాల్సివచ్చింది.రాముడ్ని,ఆయోధ్య పాతవైపోయాయి.ఇప్పుడు రాముడి సంతానంతో కులరాజకీయఆటలు మొదలయ్యాయి. అంతకు ముందు బిజేపీ చంద్రగుప్తుడ్ని కూడా కులరాజకీయాల్లోకి దింపింది. బిహార్ ఎన్నికల్లో కుశ్వాహాల ప్రభావం తక్కువేమీకాదు. మొత్తం ఓట్లలో వీరి వాటా 5శాతంపైనే ఉండటంతో రాజకీయ ఎత్తులకు పైఎత్తులు సాగుతున్నాయి. మోదీ – నితీశ్ సమరంగా తాజా ఎన్నికలు మారడంతో దళిత మైనార్టీ మహిళా ఓట్లను గుంజుకునే ప్రయత్నాలు ఊపెక్కాయి.
లేచింది మహిళా లోకం
లవకుశులను దింపినా, అశోకుడ్ని ఎన్నికల బరిలోకి లాగినా , మరెన్ని కులపరమైన వ్యూహాలు పన్నినా బిహార్ లో చివరకు తురుఫుముక్కగా నిలిచేది మహిళా ఓటు. అవును, ఇది నిజం. కులాల సమీకరణలతో ఏమాత్రం సంబంధం లేకుండా 46.6శాతం ఉన్న మహిళా ఓటర్లే రాబోయే ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టాలో నిర్ణయించబోతున్నారు. అందుకే బిజేపీ ఈ అవకాశాన్ని కూడా జారవిడుచుకోదలచుకోలేదు. మొదటి విడత ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో మహిళలకు, యువతకు సగం వాటా ఇచ్చి తన చిత్తశుద్ధిని చాటుకుంది. మరో పక్క నితీశ్ కూడా తెలివిగానే ప్రకటనలు కుమ్మరిస్తున్నారు. మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 35 శాతం రిజర్వేషన్లు ఉంటాయని అంటున్నారు.
మొత్తానికి త్రేతాయుగం నుంచి అశోకుని సామ్రాజ్యకాలం…ఆ పైన మహిళా శక్తిదాకా… అనూహ్యంగా బీహార్ ఎన్నికల్లో ప్రధానపాత్ర పోషిస్తున్నాయి. మరి చివరకు ఫలితం ఎలాఉంటుందో దీపావళికి ముందు తెలిసిపోతుంది.
– కణ్వస