రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చేశారు. రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన అధికారికంగా పార్టీలో చేరిపోవడం, ఆయనతోపాటు కొంతమంది టీడీపీ నేతలు కూడా పార్టీ కండువాలు కప్పుకోవడం.. అన్నీ జరిగిపోయాయి. అయితే, ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడిగా రేవంత్ రెడ్డి కిం కర్తవ్యం ఏంటి..? తెరాసపై మాటలు యుద్ధం పెంచినంత మాత్రాన కాంగ్రెస్ లో ప్రత్యేక స్థానం లభించేసినట్టు అవుతుందా..? ఈ తరుణంలో దశాబ్దాలుగా కాంగ్రెస్ లో ఉంటున్న సీనియర్ నేతలు తనని సొంతం చేసుకోవాలంటే రేవంత్ ఏం చేయాలి..? ఇప్పుడు ఇలాంటి ఎన్నో ప్రశ్నలు రేవంత్ చుట్టూ ఉన్నాయి. ఇల్లు అలికినంత మాత్రాన పండుగ అయిపోదు! అసలే కాంగ్రెస్ పార్టీ. పైపైకి ఐకమత్యం ప్రదర్శిస్తున్నా కొందరు సీనియర్ నేతల మధ్య కావాల్సినంత అసంతృప్తి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి నెగ్గుకుని రావాలంటే అందరూ ఓ పద్ధతి ప్రకారం కలుపుకుంటూ పోవాలి. ప్రస్తుతం రేవంత్ అదే పని సైలెంట్ గా చేసుకుంటూ వస్తున్నారని చెప్పాలి.
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటికి రేవంత్ వెళ్లారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చాలాసేపు ఆమెతో చర్చించారు. తాను పార్టీ మారాల్సి వచ్చిన పరిస్థితులను ఒక్కోటిగా ఆమెకి వివరించారు. దీంతోపాటు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు వ్యూహాలపై ఇరువురు నేతలూ చర్చించుకున్నారు. ఈ ఇద్దరు నేతల సమక్షంలో కొంతమంది తెరాస నేతలు కాంగ్రెస్ లో చేరారు. 1969తో తెలంగాణ తొలిదశ ఉద్యమ జరిగిందనీ, 2009లో మలిదశ ఉద్యమం జరిగి, ఎంతోమంది ఆత్మ బలిదానాలకు ఫలితంగా తెలంగాణ సిద్ధించిందనీ, కానీ వారి త్యాగాలకు అనుగుణంగా సర్కారు పనిచేయడం లేదని విమర్శించారు. 2019లో తుది దశ ఉద్యమం నడిపించాల్సిన అవసరం వచ్చిందన్నారు. సరే.. ఆయన మాటల్ని కాసేపు పక్కన పెడితే, కొద్ది రోజుల కింద డీకే అరుణతో కూడా ఇలానే వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. స్వయంగా అరుణ ఇంటికి వెళ్లి దాదాపు రెండు గంటల సేపు రేవంత్ మాట్లాడారు. తమ గౌరవానికీ, పెద్దరికానికీ ఎక్కడా ఎలాంటి లోటు రాకుండా వ్యవహరిస్తానని ఆమెతో రేవంత్ చెప్పినట్టు సమాచారం. మొదట్నుంచీ రాజకీయ వైరం ఉంటూ వచ్చిన డీకే అరుణను ఆ విధంగా ప్రసన్నం చేసుకున్నారు.
తన రాకపై అసంతృప్తిగా ఉన్న సీనియర్లను ఒక్కొక్కరిగా రేవంత్ కలుసుకుంటూ వస్తున్నారు. నిజానికి, రేవంత్ ను పార్టీలోకి ఆహ్వానించొద్దంటూ కొంతమంది పెద్దలు రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ కు ఆ మధ్య లేఖ రాశారు కదా. వారి అభిప్రాయాలను కాదని మరీ పార్టీ భవిష్యత్ ప్రయోజనాల దృష్ట్యా రేవంత్ ను చేర్చుకున్నారు. ఫిర్యాదు చేసిన సరదు పెద్దలకి హైకమాండ్ క్లాస్ తీసుకుంటే సరిపోతుంది! కానీ, క్షేత్రస్థాయిలో రేవంత్ పై వారిలో అసంతృప్తి అలానే ఉండిపోయే అవకాశం ఉంటుంది. అందుకే, తానే స్వయంగా సీనియర్లను కలుసుకుంటూ.. మీ అందరి మార్గదర్శకత్వంలోనే పనిచేస్తాను అనే భరోసా కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. తన చేరికతో అసంతృప్తిగా ఉన్న సీనియర్లందరినీ ఇలానే రేవంత్ కలుసుకునే అవకాశం ఉందని అంటున్నారు.