ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కోలాహలం మొదలైంది. వైకాపా శ్రేణులన్నీ రెట్టించిన ఉత్సాహంతో ఉన్నాయి. ‘అన్న వస్తున్నాడు’ అంటూ చాలాచోట్ల నేతలు కటౌట్లు పెట్టారు, బేనర్లు కట్టారు. ఇంకొపక్క జగన్ పాదయాత్ర దిగ్విజయంగా సాగాలంటూ పలువురు నేతలు గుళ్లూ గోపురాల చుట్టూ తిరుగుతూ పూజలు చేస్తున్నారు. ఎమ్మెల్యే రోజా అయితే ఏకంగా 108 కుండల్లో పొంగలి వండి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఇలా రాష్ట్రంలో వైకాపా శ్రేణులన్నీ జగన్ సీఎం కావాలంటూ పెద్ద ఎత్తున ఆకాంక్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘జగన్ స్పీక్స్’ అంటూ సోషల్ మీడియాలో వీడియోల ద్వారా దగ్గరయ్యేందుకు వైకాపా కొత్త ప్రయత్నం మొదలుపెట్టింది. పాదయాత్ర మొదలు కాబోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి జగన్ మాట్లాడారు.
‘ఇది వరకే ప్రకటించిన విధంగా ప్రజా సంకల్ప యాత్ర మొదలుపెడతున్నాను. వైయస్సార్ కుటుంబం ద్వారా మీరు నా కుటుంబంలో ఒకటయ్యారు. నన్ను నమ్మి, నాతో ప్రయాణిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆరేడు నెలలపాటు సాగే ఈ పాదయాత్ర ద్వారా మీకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాను. మీరు చెప్పే ప్రతీ అంశాన్నీ వింటాను. మీ కష్టాలను, నష్టాలను పరిష్కరించే ఆలోచనతోనే అడుగులు ముందుకు వేస్తాను. నవరత్నాలను గతంలోనే మీతో పంచుకున్నాను. వీటిని మెరుగుపరచే సలహాలు ఇస్తే, వాటిని కూడా తెలుసుకుంటూ అడుగువేస్తాను. చివరకు ఈ పాదయాత్రతో నా ప్రయత్నం ఏంటంటే… మనం ఎన్నికల సమాయానికి తయారు చేసుకునే మేనిఫెస్టో.. ఆఫీసుల్లో కూర్చుని చేసుకున్నది కాకుండా, ప్రజలు దిద్దిన మేనిఫెస్టోగా బయటకి రావాలి. ఆ దిశగా మీ సలహాలతోనే, మీరు చెప్పే అంశాలతో తయారు చేయాలన్న తాపత్రయంతోనే నా పాదయాత్ర సాగుతుంది’.. ఇదీ జగన్ తాజా సందేశం.
జగన్ మాటల్లో ఏదో తేడా కనిపిస్తోంది కదా! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్థావనే లేకుండా ఆయన మాట్లాడారు. పాదయాత్ర చేస్తున్నదే చంద్రబాబు సర్కారు పునాదులు కదల్చడానికి అని గతంలో చాలాసార్లు చెప్పారు. యాత్ర పూర్తయ్యేలోపు టీడీపీ రాక్షస పాలన అంతం కాబోతోందని ప్రచారం చేశారు. ఇప్పుడేమో పాదయాత్ర అంతిమ లక్ష్యం మేనిఫెస్టో తయారు చేసుకోవడమే చెప్పడం కాస్త కొత్తగా అనిపిస్తోంది! కేవలం దాని కోసమే పాదయాత్ర చేస్తున్నా అన్నట్టుగా చెబుతున్నారు. నిజానికి, ఈ మేనిఫెస్టో రూపకల్పన అనే టాపిక్ ఈ మధ్య ఎక్కడా వినిపించలేదు. తెలుగుదేశం పునాదులు కదల్చడమే అనే ఏకైక అజెండాతో పాదయాత్ర జరుగుతున్నట్టు కలరింగ్ ఇస్తూ వచ్చారు. వైకాపా శ్రేణులు కూడా అన్న ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్షనే ఈ తరుణంలో వ్యక్తం చేస్తున్నాయి. ప్రజల సమస్యలను తెలుసుకుని, వారు ఇచ్చిన సలహాలతోనే మేనిఫెస్టో రూపకల్ప అని జగన్ ఇప్పుడు అంటున్నారు. ఇదేదో మొదట్నుంచీ చెప్పి ఉంటే బాగుండేది కదా!