ఎస్.ఎస్. రాజమౌళి విజయయాత్రతో రచయితగా విజయేంద్ర ప్రసాద్ పాత్ర కూడా ఉంది. రాజమౌళి సినిమా కథలన్నీ ఆయన అందించినవే. భజరంగీ భాయ్‌జాన్, బాహుబలి ఒకే యేడాదిలో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. విజయ్ నటించిన మెర్శెల్కీ ఆయన స్క్రీన్ ప్లే అందించారు. రచయితగా విజయేంద్రుడిది తిరుగులేని చేయి. అయితే దర్శకుడిగా మాత్రం ఆయన విఫలమయ్యారు. ఇప్పటి వరకూ మూడు సినిమాలు తెరకెక్కిస్తే… అన్నీ ఫ్లాపులే. ఇటీవల విడుదలైన ‘శ్రీవల్లి’ కూడా నిర్మాతలకు ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. దాంతో ఇక మీదట దర్శకత్వానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకొన్నార్ట. ”ఎవరి పని వాళ్లు చేయడమే మేలు. మనకన్నీ వచ్చేశాయి అనుకోవడం పొరపాటు. ఈ విషయం మూడు సినిమాల తరవాత తెలుసుకొన్నా..” అని ఓ కార్యక్రమంలో తన నిర్ణయాన్ని ప్రకటించారు విజయేంద్ర ప్రసాద్. ఇక మీదట ఆయన పూర్తిగా కథలపైనే దృష్టిసారిస్తారన్నమాట.