మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక ఘట్టానికి విపక్షనేత శ్రీకారం చుట్టారు. ప్రతిపక్ష రాజకీయ నాయకుల పాలిట బ్రహ్మాస్త్రంగా మారిపోయిన పాదయాత్రతో ఆయన అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు తన వంతు బ్రహత్తర ప్రయత్నం మొదలెట్టారు. దీనికి ముందుగా ఆయన చేసిన కసరత్తు అంతా ఇంతా కాదనేది అందరం చూశాం. గుళ్లూ, గోపురాలూ, స్వాములూ… ఇలా ఎన్నో చుట్టేశారు. వీటన్నింటి కన్నా ముఖ్యమైనది, ఆయన స్వభావాన్ని కొంతకాలంగా దగ్గరగా పరిశీలించిన వారు కూడా ఆశ్చర్యపడేలా… మీడియా విషయంలో ఒక మెట్టు దిగడం. మీడియా సంస్థల అధిపతులతో సమావేశం అవ్వడం…. దీనిని బట్టే పాదయాత్రను ఆయన ఎంత ప్రతిష్టాత్మకంగా, నిర్ణయాత్మకంగా గుర్తించారో అర్ధమవుతుంది.
ఈ నేపధ్యంలో సోమవారం ప్రారంభమైన ఆయన పాదయాత్ర విషయంలో మీడియా పోషించబోతున్న పాత్ర ఎలా ఉంటుందనేది అందరిలో ఆసక్తి రేపుతోంది. నిజానికి గతంలో వైఎస్ ఆర్ పాదయాత్ర చేసినప్పుడు అదీ ఇది అని తేడా లేకుండా అందుబాటులో ఉన్న మీడియా అంతా మంచి కవరేజ్ ఇచ్చిందనేది వాస్తవం. అయితే అప్పటికి ఇప్పటికి పరిస్థితులు చాలా మారిపోయాయి. చానెళ్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. అదే విధంగా వాటిపై అధికార పార్టీ ప్రాబల్యం కూడా బాగా పెరిగింది. అయినప్పటికీ… జగన్ కొంత తగ్గి మరీ అభ్యర్ధించిన పరిస్థితుల్లో మీడియా పాదయాత్ర కవరేజ్ విషయంలో ఎలాంటి పాత్ర పోషించనుంది?
మిగిలిన ఆరేడు నెలల సంగతి అలా ఉంచితే… సోమవారం ప్రారంభంలోనే మీడియా జగన్ పాదయాత్ర విషయంలో తీసుకోనున్న పంధా కొంత మేరకు అవగతమైంది. యాత్ర ప్రారంభానికి ముందు టీవీ9 బాగా కవర్ చేసింది. ముందస్తు ఏర్పాట్లు, చోటా మోటా నాయకుల ప్రసంగాలు వంటివి పదే పదే చూపింది. అయితే విపక్షనేత తొలి అడుగు పడిన తర్వాత ఈ చానెల్ కవరేజ్ కాస్త తగ్గినట్టు కనిపించింది. ముఖ్యంగా జగన్ ప్రసంగాన్ని కొంత మేరకే ప్రత్యక్ష ప్రసారం చేసి ఆపేసింది. అదే ఎన్టీవీ విషయానికి వస్తే… అది ముందస్తు కవరేజ్ అంతగా ఇవ్వలేదు. కాని యాత్ర ప్రారంభంతో పాటు జగన్ ప్రసంగాన్ని కూడా లైవ్‌లో బాగా కవర్ చేసింది. ముఖ్యంగా గత వైఎస్ఆర్ పాదయాత్ర దృశ్యాలతో వీటిని కలిపి చూపించడం ఎన్టీవీ కవరేజ్‌లో హైలెట్. టీవీ 5 ఈ రెండింటితో పోలిస్తే తక్కువగానే కవర్ చేసిందని చెప్పాలి. హెచ్ ఎమ్ టీవీ, 10టీవీ, స్టూడియోఎన్, మహా టీవీ వంటివి సో…సో అనిపించాయి. ఇక రామోజీతో జగన్ గంటసేపు సమావేశమైనా అది పెద్దగా ఫలితమివ్వలేదని ఈటీవీ2 కవరేజ్ తేల్చేసింది. ఈ చానెల్ జగన్ పాదయాత్రను తన సంప్రదాయాలకు అనుగుణంగా మాత్రమే, చాలా పొదుపుగా చూపింది. అదే సమయంలో సిఎం చంద్రబాబు ఎన్టీయార్ కన్వెన్షన్ సెంటర్ ప్రారంభ కార్యక్రమం కూడా ప్లాన్ చేయడంతో జగన్ యాత్ర నుంచి కెమెరాలను మరోవైపు తిప్పడానికి టీవీ9, ఈటీవీ2… తదితర చానెళ్లకు మంచి సాకు దొరికింది. ఏదేమైనా… ఈ పాదయాత్ర కవరేజ్ విషయంలో ఇప్పటికైతే… మీడియాపై జగన్ పెట్టుకున్న ఆశలు పెద్దగా ఫలించే దాఖలా కనిపించడం లేదు. సో…ఇక ఈ నవయువ “రాజకీయా”త్రీకుడి పయనానికి ఆయన స్వంత మీడియా మాత్రమే” సాక్షి” గా మిగిలినా ఆశ్చర్యపోనక్కర్లేదు.