తెలంగాణ శాసనసభను ఏకంగాయాభై రోజులపాటు జరిపిస్తామని టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించినప్పుడు ప్రతిపక్షాలు అభ్యంతరం వెలిబుచ్చాయి. అయితే మేము చర్చలకు సిద్ధమంటే మీరెందుకు వెనక్కు పోతారని వారిని ప్రభుత్వ పెద్దలు విమర్శించారు కూడా. ఎన్ని రోజులు జరిగితే అంత ఎక్కువగా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రచార హౌరు నడుస్తుందని ప్రతిపక్షాలకూ మీడియాకు కూడా ముందే తెలుసు. ప్రచార వేదిక కాకూడదని నేను టీవీ చర్చల్లో నేరుగానే వ్యాఖ్యానించాను. ప్రభుత్వాలు ప్రచారం చేసుకోకుండా వుంటాయా అంటే వుండవు. కాని ప్రతి చిన్న విషయానికి సుదీర్ఘమైన వివరణ, ప్రభుత్వ చర్యల ప్రశంసలు, గత ప్రభుత్వాలపై మరీ ముఖ్యంగా కాంగ్రెస్‌పై దాడి ఇలా ముగిసిపోతుంటే చర్చ వల్ల ప్రయోజనం వుండదు. కాని తెలంగాణ అసెంబ్లీలో అగుపించే దృశ్యం అదే. మాట మీద సమస్యల మీద కూడా పట్టువున్న వ్యక్తిగనక కెసిఆర్ సమస్య రాగానే కాస్త వేడి పెరగ్గానే , ప్రతిపక్షాల నిశిత వ్యాఖ్యలు వినిపించగానే రంగ ప్రవేశం చేస్తారు. ఆయన శైలి సుపరిచితమైందే. సమస్య వుందని ఆమోదించినట్టే వుంటుంది గాని అందుకు తమ ప్రభుత్వ బాధ్యత లేదని చెబుతారు. తాము తీసుకున్న చర్యలను సుదీర్ఘంగా ప్రస్తావిస్తారు. గత ప్రభుత్వాలను అంటలేనంటూనే చురకలేస్తుంటారు. మేము చాలా బ్రహ్మాండంగా ఎవరూ చేయనట్టు చేశామంటూ ముగిస్తారు. కెసిఆర్ ప్రభుత్వం కొన్ని ప్రజా సంక్షేమ పథకాలు సహాయక చర్యలు అమలు చేసి వుండొచ్చు గాని ఆత్మహత్యలూ ఆందోళనలూ కూడా నిజమే కదా.. అనేక ఆశాభంగాలు కూడా వున్నాయి కదా.. అలాటివి ఏమి మాట్లాడినా కుట్ర అనీ అడ్డంకులు అనీ ముద్రలు వేసి అవమానించడం ఇబ్బందికరమైన వాస్తవం. ముఖ్యమంత్రి లేచి మాట్లాడుతుంటే సహజంగానే ప్రతిపక్షాలు గౌరవం పాటించాల్సి వస్తుంది. అలా జోక్యం చేసుకోవడం మంచిది కూడా. అయితే అన్ని వేళలా ఏకపక్షంగా సమర్థించుకుంటూ అవతలివారిని ఏకిపారేసే ఏకపాత్రగా మారిపోవడం సరైందేనా?