సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా మీడియాతో జరిపిన చర్చలలోనూ తర్వాత ఇస్తున్న ఇంటర్వ్యూలలోనూ కూడా వైసీపీ నేత జగన్ కొన్ని అంశాలు పదేపదే చెబుతున్నారు. గొప్ప ప్రజాదరణ వున్నా గతసారి తాము ఓడిపోవడానికి అయిదు కారణాలు ఆయన చూపిస్తారు. అవన్నీ చంద్రబాబు కోణంలోనే.
1. రాష్ట్ర విభజన అనంతర పరిస్థితి
2. అనుభవంతో ఆయన ఏదో చేస్తారన్న ఆశ
3. చంద్రబాబు ఇష్టానుసారం అవాస్తవికమైన వాగ్దానాలతో నమ్మించడం
4. మోడీ హవా
5. పవన్ కళ్యాణ్ మద్దతు.
ఇన్ని చేసినా కేవలం ఒకశాతం లోపు ఓట్లతోనే టిడిపి గెల్చిందని జగన్ గుర్తు చేస్తారు. అయితే అంత ఆదరణ పొందిన మీరెందుకు ఓడిపోయారంటే ఆయన విశ్లేషణ ఇవ్వరు.ఈ అయిదు కారణాల్లో ఏదయినా ఒకటి తమ ఒక్క శాతం ఓట్లు తీసుకుపోయి వుండొచ్చంటారు. నిజంగా ఒక ప్రధాన పార్టీ తన ఓటమిని తాను విశ్లేషించుకోకపోవడం విచిత్రమే. ఇప్పుడు బిజెపి గనక ప్రత్యేక హౌదా ఇస్తే మద్దతు తెలిపేందుకు అభ్యంతరం లేదటూ జగన్ తలుపులు తీసి వుంచారు. ఆ అంశం ఇప్పటికే ముగిసిపోయిందని ప్రకటించారు కదా అని అడిగినా అదే మళ్లీ చెబుతున్నారు. పైగా అప్పటి వరకూ అంశాల వారీ మద్దతు నిస్తామని కూడా చెబుతున్నారు. కాబట్టి జగన్ బిజెపికి దగ్గరగా జరిగేందుకు సిద్ధమని తేలిపోతున్నది. దీనివల్ల మీకు గతంలో ఓటేసిన వారు దూరం కారా అంటే హౌదా వస్తే వారికి నచ్చజెప్పుకుంటానని అంటున్నారు. ఈ మొగ్గు ఎంత వరకూ పోయిందంటే కొన్ని ఇంటర్వ్యూలలో జగన్ బిజెపి కూడా లౌకిక పార్టీనే కదా అని వాదించారట. అయితే వారు ఆ మాటలు రాసేందుకు వెనుకాడారు. తమిళనాడులో డిఎంకె అధినేత కరుణానిదిని మోడీని కలిసినట్టే ఎపిలోనూ రెండు ప్రధాన పార్టీలతో సంబంధాలు పెంచుకోవాలనుకుంటున్నారని స్పష్టమై పోయింది.దానికి వైసీపీ కూడా ఇష్టంగానే అంగీకరించింది. అయితే అందుకోసం బిజెపికి లౌకిక కితాబులివ్వడం అవసరం లేని వ్యవహారం కదా!