వెబ్ సిరీస్ మార్కెట్ ఊపందుకొంది. అగ్ర నిర్మాణ సంస్థలు సైతం వీటిపై దృష్టి సారించాయి. ఆర్కామీడియా ఇప్పటికే వెబ్ సిరీస్‌లు రూపొందించడానికి రంగం సిద్ధం చేసేస్తోంది. వైజయంతీ మూవీస్ డిజిటల్ రంగాన్ని టార్గెట్ చేసింది. ఇప్పుడు మారుతి కూడా వెబ్ రంగంలో కాలుమోపనున్నాడు. ఆయన్నుంచి రెండు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయని టాక్. తన శిష్యగణంలోని ఇద్దరు ఈ వెబ్ సిరీస్ లకు దర్శకత్వం వహిస్తారు. కథ, మాటలు మారుతినే అందించబోతున్నారు. సరికొత్త కాన్సెప్టులతో ఈ సీరీస్లు రాబోతున్నాయని, ఒక విధంగా వెబ్ సీరీస్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచే సత్తా.. ఈ కాన్సెప్టులకు ఉందని తెలుస్తోంది. దీని కోసం బడ్జెట్ కూడా భారీగానే కేటాయించారు. సినిమాల్ని తలదన్నేలా ఈ వెబ్ సిరీస్‌లు రూపొందించాలన్నది మారుతి టార్గెట్. ఓ పక్క నాగచైతన్యతో సినిమాపట్టాలెక్కిస్తూనే, మరోవైపు ఈ వెబ్ సిరీస్‌కి సంబంధించిన పనులు ముమ్మరం చేశాడు మారుతి. ఈ బాటలో మరింత మంది దర్శకులు అడుగుపెట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మరి వెబ్ రంగంలో మారుతి మాయ ఎలా ఉండబోతోందో..?!