కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి చేరడం పెద్ద సంచలనమే అయింది. ఆయన టీడీపీ వీడతారని ఎవ్వరూ ఊహించలేదు. కానీ, తెలుగు రాష్ట్రాల అధికార పార్టీల మధ్య మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆయన టీడీపీకి దూరమయ్యారు. గడచిన రెండు వారాలుగా ఇదే సంచలన వార్తగా నిలిచింది. తెలంగాణ కాంగ్రెస్ లో ఆయన రాకతో కొత్త ఉత్సాహం వచ్చిందని ఆ పార్టీ బలంగా నమ్ముతోంది. ఇంతకీ ఇప్పుడీ టాపిక్ ఎందుకంటే… రేవంత్ రెడ్డికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ సంగతేమోగానీ, ప్రస్తుతం ఆయన సొంత నియోజక వర్గంలోనే పరిస్థితులు కాస్త తడబాటుగా కనిపిస్తున్నాయని చెప్పాలి. కొడంగల్ లో రేవంత్ రెడ్డికి పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆయన కాంగ్రెస్ లో చేరుతున్న సమయంలో కూడా చాలామంది నేతలు వెంటే నిలిచారు. అదీ సమస్య కాదు! కానీ, ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లిన తరువాత… ఆ నియోజక వర్గంలోని ఎప్పట్నుంచో ఉంటున్న కాంగ్రెస్ నేతల సహకారం రేవంత్ కి అందుతోందా అనేదే ఇప్పుడు ప్రశ్న..?
కాంగ్రెస్ లో చేరిన తరువాత తన బలమేంటో నిరూపించుకునేందుకు రేవంత్ ప్రయత్నించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి పెద్ద ఎత్తునే అభిమానులు తరలి వచ్చారు. అయితే, సరిగ్గా ఇదే సమయంలో నియోజక వర్గానికి చెందిన కొంతమంది కాంగ్రెస్ నేతలు అధికార పార్టీ తెరాసలో చేరేందుకు హైదరాబాద్ వచ్చారు! వారితోపాటు కొందరు టీడీపీ నేతలు కూడా కలిసి వెళ్లడం, గులాబీ కండువాలు కప్పుకోవడం గమనార్హం. ఈ పరిణామంపై రేవంత్ కాస్త అసంతృప్తిగా ఉన్నట్టు కొంతమంది చెబుతున్నారు. ఇప్పటికే, ఆయన వెంట వస్తారంటూ బయటకి వచ్చిన జాబితాలోని కొందరు జిల్లా నేతలు రివర్స్ అయ్యారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ లో కొంత చర్చ జరుగుతున్న సంగతి వాస్తవమనే చెబుతున్నారు! ఇలాంటి తరుణంలో, కొడంగల్ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీకి ముఖ్యనేతగా ఉంటున్న సలీమ్, అతని అనుచరులు గులాబీ కండువా కప్పేసుకున్నారు. ఇప్పటికే కొన్ని మండలాలకు చెందిన కాంగ్రెస్ అధ్యక్షులు కూడా తెరాస వైపు చూస్తున్నట్టు సమాచారం.
రేవంత్ వెంట వస్తామన్న టీడీపీ నేతలు కొందరు కారెక్కారు, రేవంత్ వచ్చాక కాంగ్రెస్ లో ఆయనకు బాసటగా నిలవాల్సినవారిలో కొందరు కూడా తెరాస గూటికి వెళ్తున్నారు. వాస్తవానికి, రేవంత్ ను రాజకీయంగా దెబ్బతీయాలన్న వ్యూహంలో భాగంగానే అధికార పార్టీ ఈ వలసలకు ఆజ్యం పోస్తుండటమే దీనికి కారణం అని చెప్పుకోవచ్చు. కానీ, తన స్థానబలాన్ని కాపాడుకోవాల్సిన అవసరం రేవంత్ కి ఉంది కదా! రేవంత్ రాకతో ఆ ప్రాంతానికి చెందిన కొంతమంది కాంగ్రెస్ నేతలు అసంతృప్తికి గురయ్యారు. ఈ పరిస్థితిని తెరాస తమకు అనుకూలంగా మార్చుకుంది. రేవంత్ టీడీపీ వీడి వెళ్లిపోయారుగానీ… ఎన్నోయేళ్లుగా కాంగ్రెస్ ను వైరి వర్గంగానే చూస్తున్న దేశం నేతలు ఆ పార్టీలోకి వెళ్లలేకపోతున్నారు. ఈ పరిస్థితినీ తెరాస అనుకూలంగా మార్చుకుందనే చెప్పాలి. స్థానికంగా కొందరు టీడీపీ, కాంగ్రెస్ నాయకులు రేవంత్ కు ఝలక్ ఇచ్చినట్టుగానే చూడాలి. వారి విషయంలో రేవంత్ కాస్త తడబడుతున్నట్టుగా అనిపిస్తోంది. మరి, ఈ పరిస్థితి చక్కదిద్దేందుకు ఆయన దగ్గర ఉన్న వ్యూహమేంటో వేచి చూడాలి.