ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్ర మూడో రోజుకి చేరేసరికి రాజకీయం కాస్త హీటెక్కింది. సరిగ్గా ఇదే సందర్భంలో ప్యారడైజ్ పేపర్స్ వ్యవహారం వెలుగు చూడ్డం, వాటిలో వైకాపా అధినేత జగన్ పేరు కూడా ప్రస్థావనకు రావడంతో అధికార టీడీపీకి బలమైన విమర్శనాస్త్రం దొరికింది. నిజానికి, జగన్ పాదయాత్రపై ఇష్టానుసారంగా టీడీపీ నేతలెవ్వరూ ప్రతివిమర్శలకు దిగొద్దనే వ్యూహంతో ఉన్నట్టు అనుకున్నారు. ఆయన చేసిన కామెంట్స్ పై ప్రతీరోజూ స్పందిస్తూ పోతే.. పాదయాత్రకు ప్రాధాన్యత పెంచినవారం అవుతామనే ఆలోచనలో టీడీపీ ఉన్నట్టుగా చెప్పారు! అయితే, సరిగ్గా ఇప్పుడీ ప్యారడైజ్ పత్రాల వ్యవహారంతో ఒకేసారి విమర్శల ఘాటు పెంచేశారు టీడీపీ నేతలు.
ఏపీ తెలుగుదేశం అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావ్ ఈ నేపథ్యంలో జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. పనామా నుంచి ప్యారడైజ్ వరకూ అవినీతిపరుల జాబితా ఏది బయటకి వచ్చినా, అందులో ఆంధ్రా నుంచి జగన్మోహన్ రెడ్డి పేరు ఉంటోందని ఎద్దేవా చేశారు. రాజకీయాలపై అవగాహగానీ, విధానాలపై విచక్షణా జ్ఞానం లేని వ్యక్తి జగన్ అని దుయ్యబట్టారు. నంద్యాల ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రిని నడిరోడ్డు మీద కాల్చెయ్యాలన్నారనీ, గుడ్డలూడదీస్తామన్నారనీ గుర్తు చేసే ప్రయత్నం చేశారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కూడా పాదయాత్రపై విమర్శలు చేశారు. టీడీపీ సర్కారు ప్రజా సంక్షేమ యాత్ర చేస్తుంటే, జగన్ ప్రజా వంచన యాత్ర చేస్తున్నారన్నారు. గత ఎన్నికలకు ముందు రుణమాఫీని వ్యతిరేకించారనీ, పింఛెను రూ. 750 మించి ఇవ్వనని చెప్పారనీ, కానీ, ఈరోజు విశ్వసనీయత లేని హామీలు ఇస్తున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబుపై బురద చల్లడం కోసమే పాదయాత్ర పెట్టుకున్నారన్నారు. ప్యారడైజ్ పేపర్స్ ద్వారా జగన్ అవినీతి ఏంటో మరోసారి బయటపడిందన్నారు. మరో నేత వర్ల రామాయ్య మాట్లాడుతూ.. ప్యారడైజ్ పేపర్లలో జగన్ పేరు బయటకి వచ్చిన నేపథ్యాన్ని గమనించి, గతంలో వివిధ కేసుల్లో వేసిన ఛార్జిషీట్లు వేసిన సందర్భాన్ని ఊటంకిస్తూ, ఈడీ వేసిన ఐదు ఛార్జిషీట్లు ప్రస్థావిస్తూ జగన్ పై ప్రత్యేకంగా సీబీఐ ఎంక్వయిరీ వేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. వీరితోపాటు కంభంపాటి, మంత్రి ఆదినారాయణ రెడ్డి కూడా విమర్శలు చేశారు.
ఈ ప్యారడైజ్ వ్యవహారంతో టీడీపీ శ్రేణులకు కొత్త విమర్శనాస్త్రం దొరికినట్టయింది. దీన్ని నేపథ్యంగా చేసుకుని గతంలో చంద్రబాబుపై జగన్ చేసిన అభ్యంతర వ్యాఖ్యల్ని కూడా గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో… ఇక, ప్రతీరోజూ జగన్ విమర్శలూ.. టీడీపీ నేతల ప్రతి విమర్శలకు తెర లేచిందనే చెప్పాలి. పాదయాత్ర మూడో రోజులకే వాతావరణం ఇలా వేడెక్కింది. ఇంకా మున్ముందు ఇంకా ఎన్ని మాటల తూటాలు పేలతాయో వేచి చూడాలి.