చిరంజీవి ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలనే ప్రయత్నం చేసి తప్పటడుగులు వేయడం అందరికీ తెలుసు. రాజకీయాలలోకి వస్తానని చాలా ఏళ్ళు ఊరించి…ఊరించి చివరికి ప్రజారాజ్యం స్థాపించి ఏడాదిన్నరలోగానే బోర్డు తిప్పేశారు. సామాజిక న్యాయం అనే కొత్త పదం కనిపెట్టిన ఆయన తను కేంద్ర మంత్రి పదవి పొందడమే సామాజిక న్యాయం అని నిరూపించి చూపారు. రాష్ట్ర విభజన సమయంలో ‘జై సమైక్యాంధ్ర’ అని గొప్పగా నినదించిన ఆయన రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీకే ‘జై’ కొట్టారు. ఇంకా ‘జై’ కొడుతూనే ఉన్నారు కూడా. తను ప్రజా రాజ్యం పార్టీ స్థాపించినప్పుడు లక్ష్మణుడిలా వెన్నంటి నిలిచిన తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి రాజకీయాలలో ప్రవేశిస్తున్నప్పుడు అతనికి అండగా నిలవాల్సిన ‘అన్నయ్య’ ఎన్ని అవరోధాలు కల్పించాలో అన్నీ కల్పించారు. కాంగ్రెస్ పార్టీ పచ్చగా ఉన్నంత కాలం దానిని అంటిపెట్టుకొని ఉన్న చిరంజీవి ఆ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ, తిరిగి ప్రాణం పోసుకోవడానికి నానా తిప్పలు పడుతుంటే దానిని గాలికి వదిలి మళ్ళీ సినిమా రంగానికి వెళ్లిపోయారు.
తన 150వ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో చాలా మంది దర్శకుల కధలు విన్న తరువాత పూరీ జగన్నాథ్ చెప్పిన కధతో సినిమా చేసేందుకు సిద్దపడ్డారు. కానీ అంత గొప్ప దర్శకుడు చెప్పిన కధలో రెండవ భాగం నచ్చలేదంటూ ఆయనని, ఆయన కధని పక్కన పెట్టేసి మళ్ళీ కధలు వినడం మొదలుపెట్టారు. గత నాలుగు దశాబ్దాలుగా చిరంజీవి అనేక వందల సినిమాలు చేసారు. కానీ అప్పుడు ఇలాగ కధలు వింటూ కాలక్షేపం చేయలేదు. ఏడాదికి రెండు మూడు చిత్రాలు చేసిన సందర్భాలు కోకొల్లలున్నాయి. కానీ అంత అనుభవం ఉన్న నటుడు ఇప్పుడు ఒక సినిమా చేయడానికి ఇంత వెనకాముందు అవడం చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. తన 150వ సినిమా సూపర్ హిట్ అవ్వాలనే తపన కంటే అదెక్కడ ఫ్లాప్ అవుతుందనే భయం కారణంగానే ఆయన ఇంత తటపటాయిస్తున్నట్లున్నారు.
కానీ షరా మామూలుగానే ఆచితూచి మళ్ళీ మరో తప్పు చేసేందుకు సిద్దపడుతున్నట్లున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆయన 150వ సినిమాకి ఒక మంచి కధని సిద్దం చేసుకొంటున్నారనే అందరూ భావిస్తున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఆయన తమిళంలో సూపర్ హిట్ అయిన ‘కత్తి’ అనే సినిమాని తెలుగులో తీసేందుకు ఆసక్తి చూపుతునారని తెలుస్తోంది. ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఆ సినిమాలో విజయ్, సమంత, నైల్ ముఖేష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కార్పోరేట్ కంపెనీల చేతుల్లో దోపిడీకి గురవుతున్న రైతులను హీరో రక్షించడమే ఈ సినిమా కధ. రాజకీయాల బ్యాక్ డ్రాప్ ఉన్న కధ కాబట్టి అది తనకు బాగా సూట్ అవుతుందని చిరంజీవి భావిస్తున్నారుట. ఆయనతో టాగూర్ వంటి సూపర్ హిట్ సినిమా తెసిన నిర్మాత మధు మొదట ఈ కధని పవన్ కళ్యాణ్, జూ.ఎన్టీఆర్ లకు వినిపిస్తే వారు తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఆ కధతో సినిమా తీయడానికి చిరంజీవి సిద్దపడుతున్నారని సమాచారం.
తమిళ సినిమాలని తెలుగులో రీ-మేక్ చేయడం కొత్తేమీ కానప్పట్టికీ, ఆరు నెలలు కష్టపడి గరిడి సాము నేర్చుకొన్న తరువాత మూలాన పడున్న ముసలమ్మని ఒక్క దెబ్బతో చంపానని గొప్పగా చెప్పుకొన్నట్లుగా, ఇన్ని వందల సినిమాలలో చేసిన చిరంజీవి చివరికి ఒక తమిళ సినిమాని రిమేక్ చేయాలనుకోవడం నిజమయితే చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకొన్న తరువాత అత్యంత ప్రతిష్టాత్మకంగా తీస్తున్న తన 150వ సినిమా ఒకవేళ ఫ్లాప్ అయితే అంతకంటే జనాలు నవ్విపోతారు.