రాష్ట్ర విభజన కారణంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అందరూ దానిని ముందే ఊహించారు. కానీ ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీని, తమ పార్టీ నేతల రాజకీయ భవిష్యత్తుని కూడా పణంగా పెట్టి మరీ తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేసినా తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాలేకపోయింది. ఎన్నికలలో గెలుపోటములు సహజమేనని భావించవచ్చును. కానీ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోలాగే తెలంగాణాలో కూడా కాంగ్రెస్ పార్టీ క్రమంగా బలహీనపడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.రాష్ట్ర విభజనతో మూటగట్టుకొన్న ప్రజావ్యతిరేకత కారణంగా కాంగ్రెస్ పార్టీ ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో బలహీనపడుతుంటే, తెలంగాణాలో అధికార తెరాస పార్టీ అమలుచేస్తున్న ‘ఆపరేషన్ ఆకర్ష’ కారణంగా కాంగ్రెస్ పార్టీ నానాటికీ బలహీనపడుతోంది.
తెరాస ఇవ్వజూపిన పదవికి ఆశపడి మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీతో తనకున్న నాలుగు దశాబ్దాల అనుబంధాన్ని త్రెంచుకొని రెండు నెలల క్రితం తెరాసలో చేరిపోయారు. ఆ తరువాత కె.జానారెడ్డి తెరాసలోకి జంప్ చేయబోతున్నారని వార్తలు వచ్చాయి కానీ ఇంకా ఆయన వెనకాడుతున్నారు. కానీ ఆయన కంటే ముందు దానం నాగేందర్ తెరాసలోకి వెళ్లిపోబోతున్నట్లు తాజా సమాచారం. దానంతో సత్సంబంధాలున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయనను తెరాసలోకి రప్పించేందుకు మధ్యవర్తిత్వం వహిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. డి.శ్రీనివాస్ లాగే దానం నాగేందర్ కూడా కాంగ్రెస్ హైకమాండ్ తో సత్సంబంధాలున్న వ్యక్తే. అటువంటి వ్యక్తులు కూడా కాంగ్రెస్ పార్టీ గుడ్ బై చెప్పేసి తెరాసలోకి వెళ్లిపోతుండటం ఆశ్చర్యకరం. కానీ దానం నాగేందర్ మాత్రం ఆ వార్తలన్నీ కేవలం ఊహాగానాలేనని కొట్టిపడేశారు. అవి ఊహాగానాలో కావో త్వరలో ఆయనే తేల్చి చెపుతారు.