హైదరాబాద్: తెలంగాణలో నిన్న ఒక్కరోజే 13మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒక రైతు సాక్షాత్తూ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి కూతవేటుదూరంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గత పది రోజులలో హైదరాబాద్లో రెండో రైతు ఆత్మహత్య. ఆగకుండా జరుగుతున్న రైతుల ఆత్మహత్యలు… రాష్ట్రప్రజలను నివ్వెరపరుస్తున్నాయి, రాష్ట్రంలోని తీవ్ర వ్యవసాయ సంక్షోభాన్ని ఎత్తిచూపుతున్నాయి.
తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 1,285 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రతిపక్షాలు చెబుతుండగా, టీఆర్ఎస్ ఎంపీ కవిత మాత్రం 252 మంది మాత్రమే చేసుకున్నారని అంటున్నారు. రైతుల ఆత్మహత్యలపై ప్రతిపక్షాల ఆరోపణలను సీరియస్గా తీసుకోనవసరంలేదని కవిత నిన్న ఓ కార్యక్రమంలో అన్నారు. మరోవైపు మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డి ఈ ఆత్మహత్యలకు కారణం గత ప్రభుత్వాల పాలకులేనంటూ నిందను వారిమీదకు తోసే ప్రయత్నం చేశారు. 60 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన పాలకుల నిర్లక్ష్యంవల్లే ప్రస్తుతం తెలంగాణలో రైతు ఆత్మహత్య ఘటనలు చోటుచేసుకుంటున్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించగా, నాలుగేళ్ళ తర్వాత – అంటే టీఆర్ఎస్ పాలన పూర్తయిన తర్వాత రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే అప్పుడు తాము బాధ్యత వహిస్తామని లక్ష్మారెడ్డి చెప్పుకొచ్చారు. చైనా పర్యటననుంచి తిరిగొచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ – ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని రు.1.5 లక్షలనుంచి రు.6 లక్షలకు పెంచి చేతులు దులుపుకున్నారు. అదికూడా ఇకనుంచి ఆత్మహత్యలు చేసుకునేవారికే ఈ పెంపు వర్తిస్తుందని ప్రకటించారు.
రెండేళ్ళనుంచి తెలంగాణలో నెలకొన్న కరవు తరహా పరిస్థితులే ఈ పరిణామాలకు కారణమని నిపుణులు అంటున్నారు. ప్రభుత్వాలు ఈ పరిస్థితిని ఎదుర్కోటానికి సరైన చర్యలు తీసుకునిఉంటే ప్రస్తుత దుస్థితి వచ్చేదికాదని చెబుతున్నారు. సాగుబడి విఫలమవటంతో జీవనోపాధికోసం రైతులు నగరానికి వస్తున్నారని, అయితే నగరంలో వారికి నిలకడగా ఉండే ఉపాధి లభించకపోవటంతో కుంగిపోయి ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారని నిపుణుల విశ్లేషణ. ఎన్నికల సమయంలో రుణమాఫీ హామీ ఇచ్చిన ప్రస్తుత ప్రభుత్వం దానిని పక్కాగా అమలు చేయకపోవటం ఆత్మహత్యలకు మరో కారణంగా చెబుతున్నారు. జేఏసీ అధ్యక్షుడు కోదండరామ్ కూడా ఈ వాదనను సమర్థిస్తున్నారు. రైతుల అప్పులు ప్రభుత్వానికి బదిలీ అయితేనే వారికి రుణ విముక్తి సాధ్యమని చెప్పారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాల్లో 10 శాతానికికూడా ఎక్స్గ్రేషియా ముట్టలేదన్నారు.
ప్రధానంగా – చేలలోని పంటలు చేతికందకపోవటం, వేసిన బోర్లలో నీళ్ళు పడకపోవటం రైతుల ఆత్మహత్యలకు కారణాలుగా కనబడుతున్నాయి. తెలంగాణ వస్తే చాలు సమస్యలన్నీ పరిష్కారమైపోతాయని నాయకులు చెప్పిన మాటలను నమ్మిన అమాయక ప్రజలు, వాస్తవ పరిస్థితుల్లో అలాంటిదేమీ జరగపోవటంకూడా రైతుల నిరాశకు కారణాలలో ఒకటిగా చెబుతున్నారు. ఏది ఏమైనా రైతుల సమస్యలపై అధ్యయనం చేయించటం, సత్వర పరిష్కారాలు కనుగొనటం వంటి చర్యలను రాష్ట్రప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చేపట్టి ఈ ఆత్మహత్యలను ఆపటానికి తాము కృతనిశ్చయంతో ఉన్నట్లు రైతులకు భరోసా కల్పించాలి.