గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు హైకోర్టు పెట్టిన గడువు మరో మూడు నెలల్లో ముగుస్తుంది. ఈలోగా కచ్చితంగా ఎన్నికలు జరిపి తీరాలి. అందుకే అధికార తెరాస హైరానా పడుతోందని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. లక్షల సంఖ్యలో సీమాంధ్రుల ఓట్లను తొలగిస్తున్నారని కాంగ్రెస్ తీవ్రంగా ఆరోపిస్తోంది. ఏకంగా కేంద్ర ఎన్నికల కమిషన్ కు కూడా ఫిర్యాదు చేసింది. ఒకటీ రెండూ కాదు, ఏకంగా 27 లక్షల 12 వేల 468 మందిని అనర్హులుగా ప్రకటించి ఓట్లు తొలగించడానికి రంగం సిద్ధమైందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇంత పెద్ద సంఖ్యలో ఓట్లను తొలగిస్తే అది నిస్సందేహంగా చాలా పెద్ద విషయం. ఆధార్ కు, ఓటుకు సంబంధం లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కాబట్టి ఆ కారణంతో ఓట్లను తొలగించలేరు. మరి ఇంత మంది ఓట్లను ఏ కారణంతో తొలగిస్తున్నారు?
ఇంటికి తాళం వేసి ఉందనేది ఒక వాదన. అన్ని లక్షల మంది ఇళ్లకు నిజంగానే తాళం వేసి ఉందా అనే అనుమానం వస్తుంది. దీనికి ఎన్నికల కమిషన్ వారే జవాబు చెప్పాలి. సీమాంధ్రులు ఎట్టి పరిస్థితుల్లో తమకు ఓటు వేయరు కాబట్టి వారి ఓట్లను తొలగించాలని తెరాస సర్కార్ తెగించిందనేది ప్రతిపక్షాల ఆరోపణ.
ఇంతకీ విపక్షాలు ఆరోపిస్తున్నట్టు తనకు ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని తెరాస ప్రభుత్వం నిరూపిస్తుందా లేదా అనేది ప్రశ్న. వచ్చింది ప్రజల తెలంగాణ కాదు దొరల తెలంగాణ అని ఇప్పటికే ప్రతిపక్షాలతో పాటు, ఉద్యమంలో పాల్గొన్న పలు ప్రజా సంఘాలు కూడా విమర్శిస్తున్నాయి. కాబట్టి కేసీఆర్ ప్రభుత్వం నుంచి జవాబు ఆశించలగమా అని కొందరు అనుమానిస్తున్నారు.
27 లక్షల ఓట్లను తొలగించడం ద్వారా గ్రేటర్ ఎన్నికల్లో గెలవడానికి తెరాస ప్రయత్నిస్తోందా, ఇది నిజమేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇంత బాహాటంగా ఓట్లను తొలగించడం సాధ్యమా? కోర్టులున్నాయి. ఎన్నికల కమిషన్ ఉంది. రాష్ట్ర సిఇఒ అసమర్థత వల్ల ఓట్ల తొలగింపు జరిగితే సి ఇ సి జోక్యం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ ఆందోళన సరైందేనా అనేది మరో చర్చనీయాంశం.
మొత్తం మీద సీమాంధ్రుల ఓట్ల వల్ల తమ విజయానికి అడ్డంకి అని తెరాస నేతలు ఆంతరంగికంగా అంగీకరిస్తున్నారు. అయినా అడ్డగోలుగా ఓట్లను తొలగించడం సాధ్యం కాకపోవచ్చు. ఈ వ్యవహారం వల్ల, టీడీపీకి బదులు వేరే పార్టీకి ఓటు వేద్దామనుకున్న సీమాంధ్రులు కూడా, తెరాసపై కోపంతో గంప గుత్తగా టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని భావంచే అవకాశం కూడా ఉంది. ఇంతకీ ఈ ఓట్ల తొలగింపు అనే కుట్ర నిజమేనా కాదా అనేది ముందు తేలాల్సిన విషయం.