ఆంద్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోరుతూ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈనెల 26నుండి గుంటూరులో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోబోతున్నారు. అందుకోసం ఆ పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ప్రతీసారిలాగ వారికి బాధ్యతలు అప్పగించి తను చేతులు ముడుచుకొని కూర్చోకుండా ఈసారి జగన్ కూడా ఊరూరు తిరుగుతూ తన పోరాటానికి విద్యార్ధుల మద్దతు కూడగడుతున్నారు. మొన్న తిరుపతి యస్వీ యూనివర్సిటీ విద్యార్ధులతో సమావేశమైన జగన్ నేడు విశాఖలో ఏ.యు. విద్యార్ధులతో సమావేశం కానున్నారు. తను చేస్తున్న ఈ ప్రత్యేక పోరాటానికి రాష్ట్రంలో విద్యార్ధుల మద్దతు పొందగలిగినట్లయితే వారే ఉద్యమాన్ని ఉదృతం చేసి ముందుకు తీసుకువెళతారని జగన్ అభిప్రాయం కావచ్చును. అందుకే జగన్ ఈసారి నిరాహార దీక్షకు కూర్చోబోయే ముందు వివిధ యూనివర్సిటీలలో విద్యార్ధులను కలుస్తూ తన పోరాటానికి వారి మద్దతు కోరుతున్నట్లున్నారు.
అతని ప్రయత్నాలను గమనించిన తెదేపా నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు. “ప్రత్యేక హోదా కోసం జగన్ కేంద్రంతో పోరాడకుండా ఆ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై రాజకీయ యుద్ధం చేస్తున్నారు. జగన్ చేస్తున్న పోరాటం ప్రత్యేక హోదా కోసం కాదు. కుర్చీ కోసం. ఎలాగయినా ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్న జగన్ అందుకోసం ఇప్పుడు విద్యార్ధులను రెచ్చగొట్టి వారిని కూడా వాడుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అధికార దాహంతో యువత, విద్యార్ధుల జీవితాలతో ఆడుకోవాలని చూస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రి కావడం కోసం యువత తమ భవిష్యత్ పణంగా పెట్టాల్సిన అవసరం ఏమిటి? ప్రజలను విద్యార్ధులను మభ్యపెట్టేందుకే ఆయన యువభేరీ, నిరాహార దీక్షలు చేస్తున్నారు. దీనిని అందరూ గమనించాలి. ఒకవేళ జగన్ నిజంగా ప్రత్యేక హోదా కోరుకొంటున్నట్లయితే అన్ని రాజకీయ పార్టీలతో కలిసి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదా సాధించాలి తప్ప ఈవిధంగా ప్రజలు, విద్యార్ధుల జీవితాలతో ఆడుకోకూడదు,” అని హితవు పలికారు.