జి.హెచ్.యం.సి. పరిధిలో 25లక్షల మంది ఆంధ్రా ఓటర్ల పేర్లను తెరాస ప్రభుత్వం తొలగించిందని తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి ఆరోపిస్తున్నారు. తెదేపా, బీజేపీలు కూడా ఆలాగే ఆరోపిస్తున్నాయి. ఆ రెండు పార్టీలు కలిసి పోరాడటం అనైతికం, అపవిత్రం అని తేల్చిపారేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఉత్తమ కుమార్ రెడ్డిని జైలుకి వెళతావని బెదిరించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరిస్తున్నట్లుంది. ఉత్తం కుమార్ రెడ్డి కాంగ్రెస్ హయంలో గృహనిర్మాణ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణంలో అనేక అవకతవకలకు పాల్పడ్డారని, వాటిని వెలికి తీసినట్లయితే ఆయన జైలుకి వెళ్ళడం ఖాయం అని తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించడం చూస్తుంటే ఆయన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లే ఉంది.
ఆ కుంభకోణంలో కాంగ్రెస్ నేతలలో చాలా మందికి సంబంధం ఉందని వారందరినీ అరెస్ట్ చేయదలిస్తే రాష్ట్రంలో జైళ్ళు కూడా సరిపోవని అన్నారు. అక్రమాలకు పాల్పడినవారందరిపై చర్యలు తీసుకొంటామని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందునే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈవిధంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారని స్పష్టం అవుతోంది. వారిని భయపెట్టి వారి నోళ్ళు మూయించాలని ప్రయత్నించడం చూస్తుంటే ఓటర్ల పేర్లు తొలగింపు వ్యవహారంలో తెరాస ప్రభుత్వం తప్పు చేస్తున్నందునే వారికి భయపడుతున్నట్లు కనిపిస్తోంది. లేకుంటే కాంగ్రెస్ నేతలను జైళ్లలో పెడతామని ఇప్పుడు బెదిరించవలసిన అవసరం ఏమిటి? ఒకవేళ కాంగ్రెస్ నేతలు నిజంగానే అక్రమాలకూ పాల్పడి ఉన్నారని తెరాస ప్రభుత్వం వద్ద బలమయిన సాక్ష్యాధారాలుంటే వారిపై కేసులు నమోదు చేయకుండా ఇంకా ఎందుకు ఉపేక్షిస్తోంది? అవినీతికి పాల్పడినవారిపై చర్యలు తీసుకోకపోవడాన్ని ఏమని భావించాలి?
కాంగ్రెస్ నేతలు అవినీతికి పాల్పడ్డారని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపిస్తుంటే, వారు తెరాస ప్రభుత్వం చేప్పట్టిన మిషన్ కాకతీయ తదితర ప్రాజెక్టులలో భారీ ఎత్తున అవినీతి జరుగుతోందని ఆరోపిస్తున్నారు. కానీ వారి ఆరోపణలను తెరాస నేతలు తేలికగా కొట్టి పారేస్తున్నారు. రాజకీయాలలో ఓడలు బళ్ళు అవుతుంటాయి. కాంగ్రెస్ హయంలో జరిగిన అవినీతిని ప్రశ్నించి దోషులను జైళ్ళకు పంపుతామని బెదిరిస్తున్న తలసాని శ్రీనివాస్ యాదవ్, ఒకవేళ వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వస్తే అప్పుడు ఆయనకి అదే పరిస్థితి ఎదురవవచ్చును. అందుకే అనుభవం ఉన్న రాజకీయ నాయకులెవరూ తలసాని శ్రీనివాస్ యాదవ్ లాగ రెచ్చిపోరు. ఏమయినప్పటికీ ఆ రెండు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు చేసుకొంటున్న ఆరోపణల వలన రెండు ప్రభుత్వాల హయాంలో జరిగిన, జరుగుతున్న అవినీతి గురించి తెలుసుకొనే అవకాశం ప్రజలకి కల్పిస్తున్నారు.