జగ్మోహన్ దాల్మియా మరణంతో భారత క్రికెట్ చరిత్రలో ఒక శకం ముగిసిపోయింది. ఇంతవరకు చాలా మంది భారత క్రికెట్ బోర్డుఅధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించినప్పటికీ క్రికెట్ ఆటకి, బోర్డుకి జగ్మోహన్ దాల్మియా చేసినంతగా మరెవరూ సేవ, మేలు చేయలేదనే చెప్పకతప్పదు.
దాల్మియా భారత క్రికెట్ క్రీడాకారుల్లో ఎంతో ఆత్మవిశ్వాసం నింపిన వ్యక్తి. దేశ విదేశాలలో తన క్రికెట్ ఆటగాళ్ళకు ఏదయినా సమస్య ఎదురయితే ఆయన వారికి అండగా నిలబడి అందరితో పోరాడేవారు. అందుకే విదేశీ క్రికెట్ సంఘాలు, క్రీడాకారులు ఆయనని ఒక ‘భారత క్రికెట్ టెర్రరిస్ట్’ గా అభివర్ణించేవారు. రాజకీయ నాయకులతో తనకున్న పరిచయాలను కూడా ఆయన క్రికెట్ బోర్డుని మరింత బలోపేతం చేసేందుకు, ఆటగాళ్ళకు ప్రయోజనం చేకూర్చేందుకే ఉపయోగించేవారు.
ఒకానొక సమయంలో బొంబాయిలో చర్చి గేట్ రైల్వే స్టేషన్ సమీపంలో ఒక చిన్న గదిలో సాగిన క్రికెట్ బోర్డుకి ఇంత మహర్దశ కలిగేలా చేసిన వ్యక్తి ఆయనే. అదేవిధంగా ఒకప్పుడు దూరదర్శన్ ఛానల్లో క్రికెట్ మ్యాచులు ప్రసారం చేయడానికి దూరదర్శన్ కి క్రికెట్ బోర్డు రూ.5 లక్షలు చెల్లించాల్సి వచ్చేది. కానీ బోర్డును ఆర్ధికంగా పటిష్టం చేయవలసిన అవసరాన్ని గుర్తించిన దాల్మియా సుదీర్గ న్యాయపోరాటాలు చేసి ఆ పరిస్థితిని సమూలంగా మార్చివేశారు. అప్పటి నుండి క్రికెట్ మ్యాచులు ప్రసారానికి టీవీ ఛాన్నళ్ళే బోర్డుకి కోట్లాది రూపాయలు చెల్లించడం ఆరంభించాయి.
అదేవిధంగా ఆయన 1997లో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐ.సి.సి.) అధ్యక్షుడుగా ఎన్నికయిన తరువాత ఐ.సి.సి.లో కూడా అనేక సంస్కరణలు చేసారు వరల్డ్ కప్ మ్యాచుల ద్వారా వచ్చే ఆదాయం ఆతిధ్య దేశాలకి కాక ఆ మొత్తం ఐ.సి.సి.కే చెల్లించేలా సంస్కరణలు చేయడంతో ఐ.సి.సి. కూడా ఆర్ధికంగా చాలా బలపడింది. దాల్మియా చేప్పట్టిన అనేక చర్యల వలన అంతవరకు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ దేశాల చేతుల్లో ఉండిపోయిన క్రికెట్ పగ్గాలు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు చేతుల్లోకి వచ్చింది. 1984వరకు వరల్డ్ కప్ పోటీలు కేవలం ఇంగ్లాండ్ లో మాత్రమే నిర్వహించేవారు. కానీ దాల్మియా అన్ని దేశాల మద్దతు కూడగట్టి భారత్ లో మొట్టమొదటి సారిగా వరల్డ్ కప్ పోటీలు నిర్వహించగలిగారు. అప్పటి నుండే ఒక్కోసారి ఒక్కో దేశంలో వరల్డ్ కప్ పోటీలు నిర్వహించబడుతున్నాయి. బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా వంటి దేశాలకు క్రికెట్ లో చోటు కల్పించింది దాల్మియానే. ఆయన దూరదృష్టికి నిదర్శనాలుగా ఇటువంటి ఉదాహరణలు కోకొల్లలున్నాయి.
బి.సి.సి.ఐ. ఆర్ధికంగా చాలా బలపడి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగడంతో బెల్లం చుట్టూ ఈగలు మూగినట్లు బోర్డుపై పెత్తనం కోసం కాటికి కాళ్ళు చాపుకొని కూర్చొన్న ముసలి రాజకీయ నాయకులు కూడా పోటీ పడుతున్నారిప్పుడు.కానీ వారిలో ఎవరూ కూడా ఆయనలాగా క్రికెట్ కోసం, బోర్డు అభివృద్ధి కోసం పరితపించేవారు కనబడరు. దాల్మియా లేని క్రికెట్ బోర్డును ఊహించుకోవడానికే కష్టంగా ఉందని క్రికెట్ ఆటగాళ్ళు బాధపడుతున్నారంటే క్రికెట్ పై ఆయన ప్రభావం ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చును. భారత్ క్రికెట్ క్రీడకు, బోర్డుకు, ఆటగాళ్ళకు అంతర్జాతీయంగా ఒక ప్రత్యేక గుర్తింపు, గౌరవం సమకూర్చిపెట్టిన దాల్మియా ఇక లేరు అనుకొంటే జీర్ణించుకోవడమే చాలా కష్టంగా ఉంది. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని యావత్ క్రికెట్ ప్రపంచం దేవుడిని ప్రార్దిస్తోంది.