ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సింగపూర్ పర్యటన ముగించుకొని నిన్న సాయంత్రం డిల్లీ చేరుకొన్నారు. ఈరోజు ఉదయం నీతి ఆయోగ్ ఉపకమిటీ సమావేశంలో పాల్గొన్న తరువాత హోం మంత్రి రాజ్ నాద్ సింగ్, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, వ్యవసాయ శాఖామంత్రి రాధామోహన్, పట్టనాభివృద్ధి శాఖా మంత్రి వెంకయ్య నాయుడు, పౌర విమానయాన శాఖా మంత్రి అశోక్ గజపతిరాజులతో వరుసగా సమావేశం అవుతారు. రేపు ఉదయం విజయవాడకు చేరుకొంటారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదాకి బదులుగా ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించినందున దాని గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్దికమంత్రితో చర్చించే అవకాశం ఉంది. ప్రత్యేక హోదా కోరుతూ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈనెల 26నుండి గుంటూరులో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోబోతున్నందున రాష్ట్రంలో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. ఇంకా ఆలస్యం చేసినట్లయితే తెదేపా, బీజేపీలు రెండూ కూడా రాష్ట్రంలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవలసి రావడమే కాకుండా, చేజేతులా ప్రతిపక్షాలకి అవకాశం ఇచ్చినట్లవుతుంది. కనుక వీలయినంత త్వరగా ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీని ఖరారు చేయవలసిందిగా ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీని చంద్రబాబు నాయుడు కోరవచ్చును. వైజాగ్, విజయవాడ మెట్రో రైల్ సమగ్ర నివేదికలు అందాయి కనుక వాటి నిర్మాణానికి ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వ సహాయం అర్ధించవచ్చును. వచ్చేనెల 22న అమరావతి శంఖు స్థాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీని ఇంతకు ముందే ఆహ్వానించారు కనుక ఇప్పుడు కేంద్రమంత్రులను కూడా ముఖ్యమంత్రి ఆహ్వానించవచ్చు.
రాష్ట్ర విభజన హామీలలో భాగంగా ఇప్పటికే కేంద్రప్రభుత్వం రాష్ట్రంలో ఐదు ఉన్నత విద్యాసంస్థలను, ఎయిమ్స్ ఆసుపత్రిని మంజూరు చేసింది. కానీ ఇంకా వ్యవసాయ, గిరిజన, పెట్రోలియం యూనివర్సిటీలను ఏర్పాటు చేయవలసి ఉంది. వాటి ఏర్పాటు గురించి ముఖ్యమంత్రి ఈరోజు కేంద్రమంత్రులతో చర్చిస్తారని సమాచారం. ముఖ్యంగా రాష్ట్రానికి ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి గురించి ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీపై ఒత్తిడి చేయవచ్చును.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ప్రయత్నలోపం లేకుండా రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టుల గురించి కేంద్రంపై నిరంతరం ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. కానీ కేంద్రప్రభుత్వం నుండి సానుకూల స్పందన తప్ప నిర్దిష్టమయిన ఎటువంటి ప్రకటన వెలువడటం లేదు. కనీసం ఈసారయినా రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే ప్రకటన చేయించగలిగితే ప్రజలు కూడా హర్షిస్తారు. లేకుంటే ప్రతిపక్షాల నుండి మళ్ళీ విమర్శలు ఎదుర్కోక తప్పదు.