ప్రపంచ స్థాయిలో గొప్ప నగరంగా నిర్మించబోతున్న ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి విద్యుత్ అవసరాలు తీర్చేందుకు ప్రత్యేకంగా ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకొంది. విజయవాడ వద్దగల నార్ల తాతారావు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం సమీపంలోనే 800 మెగా వాట్స్ సామర్ధ్యంగల మరో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించబోతోంది. ఈ కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మాణానికి అవసరమయిన అన్ని అనుమతులను కేంద్రప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసింది. వచ్చేనెలలో రాజధానికి శంఖుస్థాపన చేసినప్పుడే ఈ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంఖుస్థాపన చేసే అవకాశం ఉంది. ఈ విద్యుత్ ప్లాంట్ కోసం ఆ ప్రాంతంలో ఒక పైలాన్ ఏర్పాటు చేసేందుకు ఆదేశాలు జారీ అయ్యాయి.
ఈ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి కనీసం 250ఎకరాలు సేకరించవలసి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. కనుక తక్షణమే అధికారులు ఆ పని మొదలుపెడతారు. రాజధాని కోసం 33,000 ఎకరాలు భూసేకరణలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుండి, ప్రతిపక్షాల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంది. బందరు పోర్టు, గన్నవరం విమానాశ్రయం విస్తరణ, భోగాపురం విమానాశ్రయం కోసం భూసేకరణకు కూడా రైతుల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోంది. కనుక మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి ఎదురవచ్చును.