దాదాపు రెండేళ్ళ విరామం తరువాత “సుబ్రహ్మణ్యం ఫర్ సేల్” సినిమాతో దర్శకుడు హరీష్ శంకర్ ఇండస్ట్రీలోకి రీ-ఎంట్రీ ఇస్తున్నారు. ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ “ఒకవిధంగా ప్రతీ సినిమాతో మనల్ని మనం ‘సేల్’ కి పెట్టుకోవాల్సిందే. సేల్ అయితే హిట్ కాకపోత్ ఫ్లాప్ అంతే! ఇప్పుడు “సుబ్రహ్మణ్యం ఫర్ సేల్” తో మళ్ళీ నన్ను నేను సేల్ కి పెట్టుకొంటున్నట్లే భావిస్తున్నాను,” అని అన్నారు.
“ప్రస్తుతం ఇండస్ట్రీలో దర్శకులదే పైచేయిలా కనిపిస్తున్నా నేటికీ హీరోలదే పైచెయ్యి అని అంగీకరించక తప్పదు. రామయ్య వస్తావయ్య సినిమా ఫెయిల్ అయ్యాక హరీష్ శంకర్ కి సినిమాలు ఎవరిస్తారు? అనే ప్రశ్న అందరిలో తలెత్తింది కానీ ఎన్టీఆర్ కి ఎవరిస్తారు? అని ఎవరూ అనుకోలేదు. దానిని బట్టి మన ఫిలిం ఇండస్ట్రీలో హీరోలదే ఎప్పుడూ పైచెయ్యి అని అర్ధం అవుతోంది. కానీ సినిమా ఫ్లాప్ అయితే ఆ బాధ్యత దర్శకుడిదే కానీ హీరోలది కాదు. మేము ఆడియన్స్ అభిరుచి, హీరో ఇమేజ్ దృష్టిలో పెట్టుకొనే కధలు తయారు చేసుకోవాలి తప్ప మా అభిప్రాయలు వాళ్ళ మీద రుద్దితే వాళ్ళు ఆదరిస్తారనే గ్యారంటీ లేదు,” అని అన్నారు.
పవన్ కళ్యాణ్ తో విభేదాలు ఏర్పడినట్లు వచ్చిన వార్తలపై స్పందిస్తూ “చాలా మంది నాకు పవన్ కళ్యాణ్ కి మధ్య విభేదాలు వచ్చాయి కనుకనే గబ్బర్ సింగ్ కి సీక్వెల్ తీయడానికి నేను ఇష్టపడలేదని అనుకొంటున్నట్లు నాకు తెలుసు. కానీ అందులో నిజం లేదు. నిజానికి నాకు పవన్ కళ్యాణ్ తో విభేదించే స్థాయి, అర్హత రెండూ లేవు. గబ్బర్ సింగ్ ఒక సర్ ప్రయిజ్ ప్యాకేజ్. దానికి సీక్వెల్ తీసేందుకు ప్రయత్నిస్తే, ఆడియన్స్ మొదటి భాగాన్ని దృష్టిలో పెట్టుకొని భారీ అంచనాలతో ధియేటర్స్ కి వస్తారు. అప్పుడు వారిని మెప్పించడం చాలా కష్టం. అందుకే సీక్వెల్ చేయలేదు,” అన్నారు హరీష్ శంకర్.
“రామయ్య.. ఫ్లాప్ తరువాత నాతో సినిమాలు చేయడానికి ఎవరూ రాలేదని మీడియాలో చాలా గాసిప్స్ వచ్చేయి. కానీ అది ఫ్లాప్ అయిన సంగతి తెలిసి కూడా అల్లు అర్జున్ వంటి పెద్ద స్టార్ హీరో నాతో సినిమా చేయడానికి సిద్దపడ్డారు. కానీ అంత పెద్ద హీరోతో సినిమా తీస్తే మళ్ళీ ప్రేక్షకుల అంచనాలు భారీగా ఉంటాయి. వాటిని అందుకోవడానికి చాలా శ్రమ, ఒత్తిడికి గురి కావలసి ఉంటుంది. అందుకే నేను ఎప్పుడో వ్రాసుకొన్న ఒక మంచి కధతో సాయి ధరమ్ తేజ్ తో ఈ సినిమా చేసాను. కానీ ఈ సినిమా గురించి కూడా అప్పుడే మీడియాలో రకరకాల టాక్ వస్తోంది. వేరే ఏదో సినిమాలో ఏదో ఒక పాయింట్ మన సినిమాలో కూడా ఎక్కడో అక్కడ ఉండవచ్చును. కొన్ని ‘ప్యాట్రాన్స్’ చాలా సినిమాలలో కనిపిస్తుంటాయి. అంత మాత్రాన్న ఆ సినిమాని కాపీ కొట్టినట్లు కాదు,” అని అన్నారు.
“ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశం వచ్చినప్పటికీ రామయ్యలో..ఆయన టాలెంట్ ని నేను సరిగ్గా వాడుకోలేకపోయానని నేటికీ నేను చాలా బాధపడుతుంటాను. కనుక మళ్ళీ అవకాశం వస్తే ఆయనతో తప్పకుండా సినిమా చేస్తా”, అని అన్నారు.
“అంతకు ముందు హిట్ అయిన సినిమాల నుండి నేను ఎటువంటి పాఠం నేర్చుకోలేదు కానీ రామయ్య… సినిమా ఫెయిల్యూర్ తో చాలా నేర్చుకొన్నాను,” అని అన్నారు. ఇప్పుడు “సుబ్రహ్మణ్యం ఫర్ సేల్” సినిమాతో తనని తాను మార్కెట్ లో సేల్ కి పెట్టుకొన్న దర్శకుడు హరీష్ శంకర్ ఈసారయినా సేల్ అవుతారో లేదో చూడాలి. రెండేళ్ళ విరామం తరువాత ఎటువంటి ఒత్తిడి లేకుండా కొత్త హీరోతో తన మనసుకు నచ్చినట్లు తీసుకొన్న సినిమా కనుక ఈసారి గ్యారంటీగా మళ్ళీ హిట్ కొడతారనే ఆశిద్దాం.