ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టిన పోరాటంలో చిత్తశుద్ధి ఉందో లేదో గానీ దీనితో ఆయన ఒకే దెబ్బకు అరడజను పిట్టలు కొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పక తప్పదు. ఈ ఉద్యమం ద్వారా తన రాజకీయ శత్రువు చంద్రబాబు నాయుడుని అప్రదిష్టపాలు చేయడం, బీజేపీతో తెదేపా సంబంధాలను దెబ్బతీయడం, రాష్ర్టంలో తన సత్తా చాటుకొని బీజేపీ దృష్టిని ఆకర్షించడం, వచ్చే ఎన్నికల వరకు తన పార్టీలో నేతలు, కార్యకర్తలు పక్క చూపులు చూడకుండా వారిని చైతన్యంగా ఉంచుతూ ఒక్క త్రాటిపై నడిపించడం, వైకాపాని ప్రజలకి మరింత చేరువ చేయడం వంటి అనేక కారణాలు, ప్రయోజనాలు ఇందులో ఇమిడి ఉన్నాయి.
ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు అయ్యే అవకాశం లేదనే చేదు నిజాన్ని రాష్ట్ర ప్రజలందరూ అంగీకరిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అంగీకరించడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెడలు వంచయినా సరే తప్పకుండా ప్రత్యేక హోదా సాధిస్తానని చెపుతున్నారు. కానీ ప్రత్యేక హోదా మంజూరు చేయవలసిన ప్రధాని నరేంద్ర మోడీ గురించి ఒక్క ముక్క కూడా నోరు జారకుండా చాలా జాగ్రత్త పడుతుండటం గమనార్హం. మోడీ గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు ఆయన చాలా లౌక్యంగా ‘కేంద్రం’ అంటుంటారు. అదే రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు అని పేరుపెట్టి మరీ విమర్శలు గుప్పిస్తుంటారు. ఆయన పోరాటం ఎవరిపై చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో అదే తెలియజేస్తోంది.
రాష్ట్ర విభజన ప్రక్రియ దాదాపు పూర్తయిపోయిన తరువాత కూడా ప్రజలు తన పార్టీకి ఓటేసి అధికారం కట్టబెడితే కేంద్రం మెడలు వంచి రాష్ట్ర విభజనని నిలిపి వేయిస్తానని అని మభ్యపెట్టేవారు. ఒకసారి రాష్ట్ర విభజన జరిగిపోయిన తరువాత దానిని ఏవిధంగా నిలిపివేయదలచుకొన్నారో ఆయన ఎన్నడూ చెప్పలేదు. మళ్ళీ అదేవిధంగా ఇప్పుడు ప్రజలందరూ తనకు మద్దతు ఇస్తే ప్రత్యేక హోదా సాధిస్తానని నమ్మబలుకుతున్నారు. ఆనాడు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ లక్షలాది ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్ధులు అందరూ రోడ్ల మీదకు వచ్చి దాదాపు మూడు నెలలు ఉద్యమాలు చేసినా కేంద్రం పట్టించుకోలేదు. ఇప్పుడు గుప్పెడు మంది వైకాపా నేతలు ప్రత్యేక హోదా కోసం ఉద్యమించినంత మాత్రాన్న కేంద్రప్రభుత్వం ప్రత్యేక హోదా మంజూరు చేస్తుందని ఆశించలేము.
అసలు జగన్ పోరాటంలో నిబద్దత ఉండదు కనుకనే ఆయన చేసిన ఏ పోరాటానికి ఆశించిన ఫలితం రావడం లేదని చెప్పవచ్చు. ప్రతీ సమస్యని కేవలం తన దృష్టి కోణంలో నుండే చూస్తూ, ప్రజలకు కూడా అలాగే చూపించే ప్రయత్నం చేస్తూ తన రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసమే జగన్ పోరాడుతుంటారు. ఒకవేళ ఆయన నిబద్దతగా ప్రజల తరపున పోరాడి ఉంటే ప్రజలే ఆయన వెంట నడిచేవారు. ఈవిధంగా ప్రజల మద్దతు కోసం జగన్ ఊరూర తిరగవలసిన అవసరం ఉండేదే కాదు.
గత 14 నెలల్లో ఆయన ఏ ఒక్క సమస్య గురించి పరిష్కారం అయ్యేవరకు పోరాడలేదు. ఆయనకు మంచి రాజకీయ మైలేజీ ఇవ్వగల రాజధాని భూసేకరణ సమస్యపై కూడా ఏకధాటిగా పోరాడలేకపోయారు. ఒకవేళ ఆయన రాజధాని గ్రామాలలో రైతుల తరపున గట్టిగా నిలబడి పోరాడి ఉండి ఉంటే ఆయన రాష్ట్రంలో తిరుగులేని నేతగా ఎదగగలిగేవారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల కోసం శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు ఎక్కడో అక్కడ భూసేకరణ చేస్తూనే ఉంది. రైతుల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటూనే ఉంది. ఒకవేళ జగన్ రాజధాని గ్రామాల రైతులకు అండగా నిలబడి నిలకడగా పోరాడి ఉండి ఉంటే, యావత్ రాష్ట్రంలో రైతులకు, గ్రామీణులకు దగ్గరయ్యేవారు. రైతుల ప్రయోజనాలు కాపాడినందుకు రాష్ట్ర ప్రజల ఆధారణ కూడా పొందగలిగేవారు. కానీ అనాలోచితంగా, నిలకడలేకుండా ముందుకు సాగుతున్న కారణంగా ప్రజలు కూడా ఆయన పోరాటాలను విశ్వసించలేక పోతున్నారు. అందుకే ప్రత్యేక హోదాపై ఆయన చేస్తున్న పోరాటాలకి కూడా రాష్ట్ర ప్రజలు స్పందించడం లేదు. వారి మద్దతు పొందలేకపోతున్నారని చెప్పవచ్చును.