హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ఢిల్లీలో రాష్ట్రానికి సంబంధించిన మూడు కీలక ఒప్పందాలను కుదుర్చుకున్నారు. చైనాకు చెందిన జియాన్ లాంగి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య మొదటి ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా జియాన్ లాంగి సంస్థ చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీలో రు.1,600 కోట్లతో 60 ఎకరాల్లో సౌర విద్యుత్ ఫలకాల తయారీ యూనిట్‌ను నెలకొల్పనుంది. ఈ ఒప్పందంపై శ్రీ సిటీ ప్రైవేట్ లిమిటెడ్, జియాన్ లాంగి ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, స్కేల్, స్కిల్, స్పీడ్ నినాదాలతో చైనా ముందుకెళుతోందని ప్రశంసించారు. ఏపీలో రెండంకెల వృద్ధి సాధించటమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఏపీలో అపార వనరులన్నాయని అన్నారు. సోలార్ విద్యుత్ వల్ల పర్యావరణానికి హాని జరగదని చెప్పారు.
మరోవైపు కేంద్ర గ్రామీణ విద్యుదీకరణ సంస్థ, ఏపీ జెన్కో మధ్య సోమవారం రెండు కీలక ఒప్పందాలు కుదిరాయి. అనంతపురంలో రు.3 వేల కోట్లతో 500 మెగావాట్ల సౌర విద్యుత్కేంద్రాన్ని నిర్మించనున్నారు. మరోవైపు నవ్యాంధ్ర రాజధానిలో ట్రాన్స్మిషన్ అండ్ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టుకు చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి సమక్షంలో ఒప్పందం కుదిరింది. రు.6 వేలకోట్లతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంది. చంద్రబాబు సింగపూర్‌కు చేసిన నాలుగు విడతల పర్యటనల సంగతేమోగాని ఇవాళ్టి ఢిల్లీ యాత్రమాత్రం ఫలవంతంగా సాగిందని చెప్పాలి.