తెలుగు దేశం పార్టీ మరోసారి గవర్నర్ నరసింహన్ ను టార్గెట్ చేసింది. ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రచార కార్యకర్తలా పనిచేస్తున్నారని ఎర్రబెల్లి దయాకర రావు ఆరోపించారు. ఒక గవర్నర్ పై నేరుగా ఇలాంటి ఆరోపణ చేయడం చాలా అరుదైన విషయం. బహుశా ఇతర రాష్ట్రాల్లోనూ ఇంత డైరెక్ట్ అటాక్ గవర్నర్ మీద జరిగిందో లేదో. గత కొంత కాలంగా గవర్నర్ వ్యవహార శైలిపై టీడీపీ దుమ్మెత్తి పోస్తోంది. సైకిల్ గుర్తుపై అసెంబ్లీకి ఎన్నికైన తలసాని శ్రీనివాస్ యాదవ్ చేత కారుగుర్తు పార్టీ తెరాస క్యాబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించింది గవర్నరే. అయితే సీఎం పంపిన జాబితా ప్రకారం అలా చేయవలసి వచ్చిందని ఆయన చెప్పవచ్చు. అయితే సమాచార కమిషనర్ల నియామకం సహా అనేక ఫైళ్లను ఆయన సంతకం చేయకుండా తప్పిపంపారు కదా అని టీడీపీ ప్రశ్నిస్తోంది.
తలసాని వ్యవహారంలోనూ అనైతక చర్యకు ఆమోదం ఎందుకు వేశారని పలువురు టీడీపీ నేతలు ప్రశ్నించారు. అంతేకాదు, ప్రభుత్వం తీసుకునే అనేక అప్రజాస్వామిక విధానాలకు గవర్నర్ అడ్డగోలుగా సై అంటున్నారనేది తెలుగు తమ్ముళ్ల ఆక్రోశం. వారి ఆరోపణలు విన్న వారికి, గవర్నర్ తెరాస సభ్యత్వం తీసుకున్నారేమో అనే అనుమానం వస్తుంది ఆ స్థాయిలో గవర్నర్ పై ఆరోపణల దాడి చేస్తున్నారు.
అయితే ఏపీకి కూడా ఈయనే గవర్నర్. అక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతోనూ వివాదాలు లేవు. అక్కడా అన్ని విషయాలకూ సహకరిస్తున్నారు. దేనికీ సతాయించిన సందర్భాలు లేవు. ఆ విధంగా చూస్తే రెండు రాష్ట్ర ప్రభుత్వాలతోనూ వివాద రహితంగా మసలుకుంటున్నారని అనుకోవచ్చు. కానీ తెలంగాణ టీడీపీ మాత్రం గవర్నర్ ను ఘాటుగా విమర్శిస్తూ పోతోంది.