హైదరాబాద్: సౌదీ అరేబియాలో హజ్ యాత్రలో ఇవాళ విషాదం చోటుచేసుకుంది. మక్కా నగరం శివార్లలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 700మందికి పైగా చనిపోయారు… 800మందిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు. గత 15 రోజుల్లో హజ్ యాత్రలో ఇంత పెద్ద దుర్ఘటన జరగటం ఇది రెండోసారి. ఈ నెల 11న ఒక క్రేన్ కూలి 118మంది చనిపోయారు… 394మంది గాయపడ్డారు. నాటి మృతులలో తెలుగువారుకూడా ఉన్నారు.
ఇవాళ్టి దుర్ఘటన పవిత్ర పుణ్యక్షేత్రం మక్కా నగరానికి 5 కిలోమీటర్ల దూరంలో అరాఫత్ కొండకు, మక్క మసీదుకు మధ్య ఉన్న మినావద్ద తొక్కిసలాట కారణంగా జరిగింది. హజ్ యాత్రలోని చివరి అంచెలో భాగంగా సైతాన్‌పై రాళ్ళు కొడుతుండగా దుర్ఘటన చోటు చేసుకుంది. సహాయ కార్యక్రమాలు సాగుతున్నాయి. 4000మంది సిబ్బందిని ఘటనాస్థలానికి పంపామని సౌదీ అధికారులు ట్విట్టర్లో పేర్కొన్నారు. క్షతగాత్రులను సమీపంలోని 4 ఆసుపత్రులకు తరలిస్తున్నారు. పరిస్థితి ఇప్పుడు అదుపులో ఉంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిమ్‌లకు పుణ్యక్షేత్రమైన మక్కాలో దుర్ఘటనలు ఎక్కువగానే జరుగుతుంటాయి. 1990లో జరిగిన అతిపెద్ద తొక్కిసలాట దుర్ఘటనలో 1,426మంది చనిపోయారు. ఇవాళ్టి దుర్ఘటన జరిగిన సైతాన్‌పై రాళ్ళుకొట్టే ప్రదేశంలోనే ఎక్కువగా దుర్ఘటనలు జరుగుతుంటాయి. దీనినే అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంగా చెబుతారు.