హైదరాబాద్: తెలంగాణలో రైతు ఆత్మహత్యలు, కల్తీ కల్లు మరణాలు ఆగడంలేదు. నిన్న మరో 17మంది రైతులు బలవన్మరణం పాలై చనిపోగా, కల్తీ కల్లు లేక మరో 19మంది చనిపోయారు. సాగు భారమై, అప్పుల భారం అధికమై రైతులు ప్రాణాలు తీసుకుంటున్నారు. మంగళవారం రాత్రినుంచి బుధవారంవరకు వివిధ జిల్లాలలో 17మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతులు 673మంది అని రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రాధమిక అంచనా వేసింది. అందులో వ్యవసాయ సమస్యల కారణంగా ఆత్మహత్యలు చేసుకున్నది 305మందేనని పేర్కొంది. మిగతావారు ఇతర సమస్యలతో బలవన్మరణాలకు పాల్పడినట్లు చెబుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 226 మండలాలలో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని అర్థగణాంకశాఖ లెక్కలు చెబుతుండగా, కరవు మండలాలు 57 మాత్రమేనని రెవెన్యూశాఖ ప్రాధమిక అంచనా.
మరోవైపు కల్తీ కల్లు తెలంగాణ పల్లెలపై మృత్యుపంజా విసురుతోంది. ఇన్నాళ్ళూ కల్తీ కల్లుకు బానిసలైనవారందరూ మత్తుకు దూరమై చావుకు చేరువవుతున్నారు. కొందరు పిచ్చెక్కి ప్రాణాలు తీసుకుంటే, మరికొందరు ఆసుపత్రుల్లో కన్నుమూస్తున్నారు. బుధవారం ఇలా 19మంది చనిపోయారు. కల్తీకల్లుకు విరుగుడు మందులు అందుబాటులో ఉన్నాయని, వీటిని అదుపులో ఉంచకుండా కల్లుపై నిషేధం విధించటం సరికాదని వైద్యనిపుణులు చెబుతున్నారు. మానేయాలని భావించేవారికి ఈ విషయంపై ధృడసంకల్పం ఉండాలని, ఇందుకోసం బాధితులు ముందు వైద్యులను సంప్రదించి వారు ఇచ్చే సూచనలు, సలహాలు పాటించలని అంటున్నారు. వీటిసాయంతో బాధితుని శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలను బయటికి పంపి మామూలు మనిషిని చేయొచ్చని చెబుతున్నారు.