హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు మరో మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలు రాబోతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆయన ఇవాళ సాయంత్రం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. గత రెండు రోజులలో ఢిల్లీలో కేంద్ర మంత్రులతో జరిపిన చర్చలలో ఏర్పడిన పురోగతిని వివరించారు. చిత్తూరు జిల్లా శ్రీ సిటీకి అనేక కంపెనీలు వస్తున్నాయని చెప్పారు. కర్నూలు-అమరావతి రహదారిని జాతీయ రహదారిగా గుర్తిస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు. రెండు రాష్ట్రాలమధ్య సమస్యలు త్వరగా పరిష్కరించాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. గోదావరి-కృష్ణ నదుల అనుసంధానంలో సఫలీకృతమయ్యామని చెప్పారు. కృష్ణా-పెన్నా నదుల అనుసంధానాన్ని చేపట్టబోతున్నామని వెల్లడించారు. విద్యుత్ కొరతను చాలావరకు అధిగమించామని, విద్యుత్‌లో ఏపీ మిగులు రాష్ట్రంగా మారబోతోందని తెలిపారు. పోలవరం పూర్తవ్వాలంటే కేంద్ర సహకారం తప్పనిసరని తెలిపినట్లు పేర్కొన్నారు. గత పదేళ్ళలో కాంగ్రెస్ ప్రభుత్వాల తప్పుడు విధానాలవలన వ్యవసాయం నిర్వీర్యమైపోయిందని అన్నారు. విశాఖకు 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్ రాబోతోందని చెప్పారు. ఏపీని ఆర్థికంగా ఆదుకోవాలని కోరామని, దీనిపై కేంద్రం ఒకటి, రెండు రోజుల్లో ప్రకటన చేసే అవకాశముందని చంద్రబాబు తెలిపారు.
కేంద్రం చేస్తుందని చంద్రబాబు చెబుతున్న ప్రకటన వాస్తవానికి ఇవాళే రావాల్సింది. కేంద్రం ఈ సాయంత్రం ఒక ప్రకటన వెలువరిస్తుందని సుజనా చౌదరి ఇవాళ ఉదయం చెప్పారు. అయితే టెక్నికల్ గా ఏదో అవాంతరం ఏర్పడినట్లుంది… ప్రకటన ఇవాళ రాలేదు. నిశితంగా గమనిస్తే 26నుంచి జగన్ చేపట్టిన దీక్షను ఎదుర్కోవటంకోసమే టీడీపీ నేతలు ఇప్పుడు అర్జంటుగా కేంద్రంతో ఈ ప్రకటన చేయిస్తున్నట్లుగా కనబడుతోంది.