రామోజీరావు, జగన్మోహన్ రెడ్డి తమ తమ మీడియాలలో నిత్యం ఒకరిపై మరొకరు విషం కక్కుకొంటూ కధనాలు, కార్టూన్లు ప్రచురించుకొంటుంటారు. ఇంతకాలం వారి మీడియాలు ఒకరికొకరు రకరకాల పేర్లు పెట్టుకొని అవహేళన చేసుకొన్నాయి. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అకస్మాత్తుగా రామోజీరావు అంటే ఎక్కడ లేని గౌరవం, అభిమానం పుట్టుకొచ్చేసాయి. రామోజీ రావు చాలా పెద్దవారు. ఆయన సలహాలు తీసుకోనేందుకే జగన్ వెళ్లి కలిసారని వైకాపా గుంటూరు జిల్లా అధ్యక్షుడు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు. పెద్దవారయిన రామోజీని జగన్ మర్యాదపూర్వకంగా కలిస్తే తప్పేమిటి? అని ఎదురు ప్రశ్నించారు. రామోజీని జగన్ ఎన్నడూ విమర్శించలేదని చెప్పడం మరీ విచిత్రం.
జగన్ ప్రదర్శిస్తున్న ఇటువంటి పరస్పర విరుద్దమయిన ద్వంద వైఖరి వలననే ఆయన విశ్వసనీయత ఎప్పుడూ ప్రశ్నార్ధకంగా ఉంటుంది. తనకు, తన పార్టీకి, మీడియాకి బద్ద విరోధి అయిన రామోజీని పనిగట్టుకొని వెళ్లి ఎందుకు కలిసారు? అనే సందేహాలకు సూటిగా జావాబు చెప్పకుండా ఈవిధంగా సమర్ధించుకోవడం వలన ప్రజలలో మరింత అనుమానం పెరుగుతుందే తప్ప తగ్గదు. అందుకే మీడియాలో వారిరువురి సమావేశం గురించి రకరకాల ఊహాగానాలు వెలువడ్డాయి. వారి ఏ ఉద్దేశ్యంతో సమావేశం అయినప్పటికీ అది ప్రజలకి, రాజకీయ పార్టీలకి చాలా తప్పుడు సంకేతాలు పంపాయని చెప్పక తప్పదు.