హైదరాబాద్: రాష్ట్రంలో కల్తీ కల్లు మృతులు సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. రోజుకు కనీసం పదిమంది పిట్టలు రాలినట్లు రాలిపోతున్నారు. దానికి ఎన్నోరెట్లమంది ఆసుపత్రుల పాలవుతున్నారు. ఈ పాపం కేసీఆర్ ప్రభుత్వానిదే. ఇలాగే రోజుకు కనీసం పదిమంది చనిపోతున్న రైతులపై ప్రభుత్వ పెద్దలు స్పందిస్తూ, ఈ పాపం గతపాలకులదేనని, నాలుగేళ్ళ తర్వాత చనిపోతే తమ బాధ్యత అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. మరి కల్తీ కల్లు బాధ్యత ఎవరిదంటారో!
కల్తీకల్లును నిర్మూలించాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ వ్యాపారంపై ఉన్నట్లుండి ఉచ్చు బిగించటంతో ఈ సమస్య ప్రారంభమయింది. ఎక్సైజ్ అధికారులు గత కొద్దిరోజులుగా కల్తీకల్లు స్థావరాలపై దాడులు చేస్తున్నారు. దీనితో కల్తీకల్లు చాలాచోట్ల నిలిచిపోయింది. ఇంతకాలం ఈ దాడుల ముప్పు లేకపోవటంతో వ్యాపారులు డైజోపామ్, ఆల్ఫజోలమ్ వంటి మత్తుపదార్థాలతో కల్తీకల్లును తయారుచేసి డబ్బులు దండుకుంటున్నారు. ఈ మత్తుమందులకు ఇప్పటివరకూ అలవాటుపడినవారు ఇప్పుడు ఒక్కసారిగా అది లేకపోయేసరికి తట్టుకోలేకపోతున్నారు. కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు… మరికొందరు పిచ్చెక్కినట్లు ప్రవర్తిస్తున్నారు.
కల్తీకల్లు సమస్యకు మూలం కేసీఆర్ ప్రభుత్వం నూతన ఎక్సైజ్ విధానానికి రూపకల్పన చేస్తున్నపుడు రూపుదిద్దుకుంది. కల్తీ కల్లువలన పేదప్రజలు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎంతో నష్టపోతున్నారుకనుక చీప్ లిక్కర్ ప్రవేశపెట్టటంద్వారా కల్లు వినియోగం తగ్గించొచ్చని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు. కానీ చీప్ లిక్కర్‌పై తీవ్ర వ్యతిరేకత ఎదురవటంతో ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు. ఆ తర్వాత కల్తీ కల్లు తయారీ స్థావరాలపై దాడులు ప్రారంభమయ్యాయి. చీప్ లిక్కరే బెటర్ అనిపించటానికే ప్రభుత్వం ఇలా కల్తీ కల్లు స్థావరాలపై దాడులు చేస్తోందా అని అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. దాడుల కారణంగానే బాధితుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఇటువంటి పరిస్థితిని ఊహించి, విరుగుడును, ముందస్తు జాగ్రత్తలను తీసుకుని ప్రభుత్వం రంగంలోకి దిగిఉంటే బాగుండేది. అలాంటి చర్యలేమీ లేకుండా దాడులు జరపటంవలన ఈ సంక్షోభం తలెత్తింది. ఇప్పుడుకూడా ఈ సంక్షోభాన్ని ఎదుర్కోటానికి అధికార యంత్రాంగంవైపునుంచి ఎటువంటి పటిష్ఠమైన కార్యాచరణ ప్రణాళిక, ఏర్పాట్లు లేకపోవటంచూస్తుంటే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిపై అనుమానాలు కలగటం సహజమే.