ప్రతిపక్షాలు ఎంతగా అభ్యంతరం చెపుతున్నా ఎన్ని ఆరోపణలు చేస్తున్నా తెదేపా ప్రభుత్వం పట్టుదలగా పట్టిసీమ ప్రాజెక్టుతో ముందుకు సాగిపోతోంది. చివరికి అధికార పార్టీ నేతలే ఆ ప్రాజెక్టు వలన ఎటువంటి ప్రయోజనం ఉండదని అభిప్రాయలు వ్యక్తం చేస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం పట్టిసీమను చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తూ పూర్తి చేస్తున్నారు. ఇక తెదేపాకి మిత్రపక్షంగా రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ పట్టిసీమపై చాలా అయోమయంలో ఉన్నట్లుంది. పట్టిసీమ ప్రాజెక్టులో భారీగా సొమ్ము చేతులు మారుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న అది వారి వాదనను సమర్ధించలేక, అలాగని ప్రభుత్వాన్ని విమర్శించలేక ఇబ్బంది పడుతోంది.
“ఆ ప్రాజెక్టును మొదట నేను కూడావ్యతిరేకించాను. కానీ అది చాలా ఉపయోగకరమయిన ప్రాజెక్టు అని గ్రహించాను. రాష్ట్ర ప్రభుత్వం పట్టిసీమను ఎంత పట్టుదలగా వేగంగా పూర్తి చేసిందో అలాగే పోలవరాన్ని కూడా పూర్తి చేయాలని కోరుకొంటున్నాను. దానికి కేంద్రప్రభుత్వం అన్నివిధాల సహకరించేలా మేము కృషి చేస్తాము,” అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కంబంపాటి హరిబాబు కొన్ని రోజుల క్రితం అన్నారు. ముందు ఆ ప్రాజెక్టుని వ్యతిరేకించిన ఆయన తరువాత ఎందుకు సమర్ధిస్తున్నారో తెలియదు. కానీ ఆయన మాటల్లో పట్టిసీమ కంటే పోలవరంపై దృష్టిపెట్టమని రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి సూచన కూడా వినిపిస్తోంది.
“పట్టిసీమ ప్రాజెక్టు ఒక నిరుపయోగమయిన ప్రాజెక్టు. మూడేళ్ళ తరువాత కనబడని ఆ ప్రాజెక్టు ద్వారా రాయలసేమకు నీళ్ళు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం చాలా హాస్యాస్పదం. పట్టిసీమపై చూపుతున్న శ్రద్ద ఏదో పోలవరం ప్రాజెక్టుపై చూపిస్తే ప్రయోజనం ఉంటుంది. దానికోసం కేంద్రప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులు ఏమవుతున్నాయో ఎక్కడ ఖర్చు చేస్తున్నారో తెలియడం లేదు,” అని బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు పురందేశ్వరి విమర్శించారు. ఆమె ఎక్కడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు ఎత్తకపోయినా ఆమె ఆయనను ఉద్దేశ్యించి చేసిన విమర్శలేనని వేరేగా చెప్పనవసరం లేదు.
ఇంతవరకు ప్రతిపక్షాల విమర్శలను తెదేపా నేతలు చాల బాగానే తిప్పికొడుతున్నారు. కానీ మిత్రపక్షమయిన బీజేపీకి చెందిన పురందేశ్వరి చేస్తున్న ఈ విమర్శలకు రాష్ట్ర ప్రభుత్వం ఏమి సమాధానం చెపుతుందో లేక విననట్లు పట్టించుకోకుండా ఊరుకొంటుందో?