జగన్మోహన్ రెడ్డి పనిగట్టుకొని ఫిలిం సిటీకి వెళ్లి రామోజీరావుని మర్యాదపూర్వకంగా కలవాల్సిన అవసరం ఏమిటి? అనే దానిపై రకరకాల ఊహాగానాలు వినపడుతున్నాయి. కానీ వారిద్దరి సమావేశం గురించి ఈనాడు, సాక్షి మీడియాలలో ఒక్క ముక్క కూడా వ్రాయలేదు. అసలు తను బద్దశత్రువయిన రామోజీరావుని కలవబోతున్నట్లు తన పార్టీ నేతలకి కూడా తెలియనివ్వలేదు. అలాగే తమ సమావేశం గురించి ఇంతవరకు జగన్ ఎవరి వద్ద నోరు విప్పలేదు. ఆవిధంగా గోప్యత పాటిస్తే సహజంగానే అందరిలో అనుమానాలు, రకరకాల ఆలోచనలు కలుగుతాయి. కానీ వాటి వలన అందరి కంటే ఎక్కువ నష్టం జరిగేది ఎవరికి? అని ఆలోచిస్తే మొదట రామోజీరావుకి తరువాత తెదేపాకి అని చెప్పక తప్పదు. కానీ జగన్ కి వైకాపాకి ఆ ఊహాగానాల వలన ఎటువంటి నష్టం జరుగక పోవచ్చును.
ఇక్కడ ఒక సందర్భోచితమయిన చిన్న కధ చెప్పుకొంటే పరిస్థితి మరింత బాగా అర్ధం చేసుకావచ్చును. ఒకానొకప్పుడు ఎంతో సఖ్యతగా ఉంటున్న అత్తాకోడళ్ళని చూసి ఓర్వలేని పొరుగింటి పుల్లమ్మ ఓ రోజు కోడలి దగ్గరకి వెళ్లి “బియ్యంలో వడ్లగింజలు చూసి ఏరమ్మా..” అని ఆమె చెవులో రహస్యంగా చెప్పి చక్కా వచ్చేసిందిట. అప్పుడు అత్తగారు కోడలిని పిలిచి ఆవిడ నీ చెవిలో అంత రహస్యంగా ఏమి చెప్పిందని అడిగితే కోడలు ఆ..ఏమీ లేదు..బియ్యంలో వడ్ల గింజల గురించి చెప్పింది అందిట. అప్పటి నుండి ఆ అత్తకోడళ్ళ మధ్య అనుమానాలు, విభేదాలు మొదలయ్యాయిట.
బహుశః జగన్ కూడా అదే ప్రయోగం రామోజీ మీద చేసాడేమో? ఇదివరకు వైకాపా ఫ్లెక్సీ బ్యానర్లలో సీనియర్ ఎన్టీఆర్, జూ.ఎన్టీఆర్ బొమ్మలు ప్రచురించి జూ.ఎన్టీఆర్ కి తెదేపాకి మధ్య చిచ్చుపెట్టి వారి మధ్య అనుమానాలు కలిగించి వారిని శాస్వితంగా దూరం చేయగలిగింది. బహుశః ఇప్పుడు అదే వ్యూహంతో జగన్ రామోజీని కలిసి ఉండవచ్చును. రామోజీ క్రమంగా తెదేపాకు దూరం అవుతున్నారని అందుకే ఇసుక మాఫియా గురించి ఈనాడులో బ్యానర్ ఐటమ్స్ వేశారని కొందరు విశ్లేషించి వ్రాసారు. అటువంటి వార్తలు తెదేపాలో అనుమాన బీజాలు నాటవచ్చును.
ఒకవేళ రామోజీపై తెదేపాకు అనుమానం కలిగించి వారి మధ్య చిచ్చుపెట్టగలిగితే మొదట తెదేపా, తరువాత రామోజీ ఇద్దరూ ఇబ్బందుల్లో పడతారు. కానీ జగన్ వేసిన ఈ ఎత్తులను రామోజీ గ్రహించలేరనుకొంటే అంతకంటే పొరపాటు మరొకటి ఉండదు. అలాగే అపార రాజకీయ అనుభవజ్ఞుడయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటువంటి ఎత్తులను చాలా తేలికగానే అర్ధం చేసుకోగలరు. కానీ తమ సమావేశం గురించి జగన్ పాటిస్తున్న గోప్యత వలన, మీడియాలో వస్తున్న రకరకాల ఊహాగానాల వలన తెదేపా నేతల్లో అనుమాన బీజాలు ఇప్పటికే పడిఉంటాయి. వాటిని తొలగించాల్సిన బాధ్యత మాత్రం రామోజీరావుదే లేకుంటే జగన్ పన్నిన వ్యూహంలో చిక్కుకోవడం తధ్యం.
జగన్, రామోజీ దగ్గరవుతున్నారని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం పద్దారు. కానీ రెండు పూర్తి విభిన్నమయిన రాజకీయ పార్టీలకి, మీడియాలకి, కులాలకి చెందిన రామోజీరావు, జగన్మోహన్ రెడ్డిలు కలిసి పనిచేయడం అసంభవమని చెప్పవచ్చును. ఒకవేళ తాత్కాలికంగా వారు ఏదో ఒక కారణంగా చేతులు కలిపినా పైన పేర్కొన్న మూడింటి వలన వారు మళ్ళీ వెంటనే విడిపోక తప్పదు. అప్పుడు ఇద్దరూ చాలా నష్టపోవచ్చును. మళ్ళీ వారిలో రామోజీయే ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంటుంది. తనది ఒక కన్ను పోయినా పరువాలేదు ఎదుట వాడివి రెండు కళ్ళుపోవాలని జగన్ అనుకొంటే రామోజీతో స్నేహానికే మొగ్గు చూపవచ్చును.