భారత అంతరిక్షపరిశోధన సంస్థ (ఇస్రో) కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసే ‘అస్ట్రో శాట్’ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పి.ఎస్. ఎల్.వి.సి-30 విజయవంతంగా ప్రవేశపెట్టింది. తమ ప్రయోగం విజయవంతం అయిందని ఇస్రో చైర్మెన్ ఏ.యస్. కిరణ్ కుమార్ ప్రకటించారు. శ్రీహరి కోత నుండి ఉదయం పది గంటలకు పి.ఎస్. ఎల్.వి.సి-30 ని ప్రయోగించగా అది సరిగ్గా 22నిమిషాల 32సెకండ్ల తరువాత ‘అస్ట్రో శాట్’ ని దాని నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. అంతరిక్ష పరిశోధనల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ అస్ట్రో శాట్’ ఉపగ్రహం తయారుచేసేందుకు ఇస్రో శాస్త్రజ్ఞులు 10 ఏళ్ల పాటు శ్రమించారు. ఈ ఉపగ్రహం ద్వారా అంతరిక్షంలో బ్లాక్ హోల్స్ అయస్కాంత ప్రభావం, నక్షత్రాల పుట్టుక వంటి అనేక అంశాల గురించి భారత అంతరిక్ష శాస్త్రవేత్తలు పరిశోధన చేయబోతున్నారు. సుమారు 1513 కేజీల బరువు ఉండే ఈ ఉపగ్రహంతో బాటు అమెరికా, కెనడా, ఇండోనేషియా దేశాలకు చెందిన మరో ఆరు ఉపగ్రహాలను కూడా పి.ఎస్. ఎల్.వి.సి-30 ద్వారా అంతరిక్షంలోకి ప్రవేశపెడుతున్నారు. వీటితో కలిపి భారత్ ఇంతవరకు మొత్తం 50 విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టినట్లయింది. ఇస్రో సంస్థ ద్వారా అంతరిక్షంలో ఉపగ్రహాలు ప్రవేశపెట్టడం చాలా తక్కువ ఖర్చుతో వీలవుతున్న కారణంగా అమెరికాతో సహా అనేక దేశాలు ఇప్పుడు ఇస్రోనే ఆశ్రయిస్తున్నాయి. తద్వారా ఇస్రో కూడా అంతరిక్షంలోకి ఉపగ్రహాలు ప్రవేశపెట్టే వ్యాపారంలో అగ్రగామిగా నిలుస్తూ ఇటువంటి ప్రయోగాలకు తనే స్వయంగా అవసరమయిన నిధులు సమకూర్చుకొనే స్థాయికి ఎదుగుతోంది.ఇస్రో శాస్త్రజ్ఞులు ఈరోజు ప్రయోగిస్తున్న పి.ఎస్. ఎల్.వి.సి-30 ఉపగ్రహవాహక నౌక ద్వారా ఒకేసారి ఏడు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టబోతున్నారు. ఈవిధంగా ఒకేసారి ఏకంగా ఏడు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడం ఇస్రోకి ఇది మూడవసారి అవుతుంది.