ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ భారత కాలమాన ప్రకారం సోమవారం ఉదయం కాలిఫోర్నియాలోని శాప్ సెంటర్ లో భారతీయులను ఉద్దేశ్యించి చాలా ఉత్తేజపూర్వకమయిన ప్రసంగం చేసారు.
“ఒకప్పుడు భారతదేశం నుండి వివిధ రంగాలకు చెందిన మేధావులు, నిపుణులు, కార్మికులు పని కోసం విదేశాలకు వెళ్ళేవారు. కానీ ఇప్పుడు యావత్ ప్రపంచం భారత్ ని ఒక మేధో సంపత్తి దేశంగా గుర్తిస్తోంది. అందుకు కారణం కంప్యూటర్స్, అంతరిక్షం వంటి అనేక రంగాలలో భారతీయులు ప్రదర్శిస్తున్న ప్రతిభాపాటవాలే. 125 కోట్ల జనభా ఉన్న భారతదేశంలో 65శాతం మంది యువతే. ఆ యువశక్తి భారత్ శక్తి సామర్ద్యాలకు ప్రతీకగా నిలుస్తోంది. దేశంలో నేటికీ పేదరికం ఉన్నప్పటికీ దేశం అన్ని రంగాలలో చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది.”
“భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశానికి అంతరిక్ష ప్రయోగాలు ఎందుకని ఒకప్పుడు అందరూ గేలి చేసేవారు. అంగారకగ్రహంపి పరిశోధనలు జరిపేందుకు భారత్ ‘మంగళ్ యాన్’ ప్రయోగం చేస్తున్నప్పుడు కూడా చాలా మంది గేలి చేసారు. కానీ ప్రపంచంలో మరే దేశానికి సాధ్యంకాని రీతిలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ శాస్త్రజ్ఞులు తమ మొదటిప్రయట్నంలోనే అతి తక్కువ ఖర్చుతో అంగారక గ్రహం మీదకి ‘మామ్’ ఉపగ్రహాన్ని పంపగాలిగారు. కనుక ఇంతవరకు మనల్ని గేలి చేస్తున్నవాళ్ళే ఇప్పుడు తమ ఉపగ్రహాలను అంతరిక్షంలో పంపమని మనల్ని కోరుతున్నారు. విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టడం ద్వారా భారీ ఆదాయం భారత్ కి వస్తోందిప్పుడు.”
“దేశం నుండి అవినీతిని తరిమికొట్టడం ద్వారా పేదరిక నిర్మూలనకి మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. భారత్ అభివృద్ధికి స్పీడ్ బ్రేకర్ లా తయారయిన ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు మేము శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాము. బుద్దుడు, గాంధీ వంటి మహనీయులు జన్మించిన భారత్ ఎప్పుడూ శాంతి, అహింసలనే కోరుకొంటుంది. కనుక ప్రపంచ దేశాలన్నీ ఉగ్రవాదం, మానవత్వం, హింసా, ఆహింసలలో తాము ఎటువైపు ఉండదలచాయో తేల్చుకోవాలి. భారతదేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి పేదరికం రూపుమాపేందుకు నేను, నా ప్రభుత్వం కృషి చేస్తున్నాము. ప్రవాస భారతీయులు కూడా ఈ మహా యజ్ఞంలో పాలుపంచుకొని మాతృదేశ రుణం తీర్చుకోవాలని నేను మీ అందరినీ కోరుతున్నాను,” అని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు.