హైదరాబాద్: విశాఖపట్నంలో డ్రైనేజ్ కాల్వలో పడి గల్లంతయిన ఆరేళ్ళ పాప అదితి ఆచూకీ ఐదురోజులైనా ఇంకా దొరకలేదు. ప్రభుత్వం డ్రైనేజ్ కాల్వల్లో, సముద్రంలో తీవ్రంగా గాలిస్తున్నా ఇంతవరకు ప్రయోజనం శూన్యం. సముద్రంలో పది బోట్లలో 50మంది జాలర్లు, డ్రైనేజిలో వందమంది మనుషులు, రిషికొండనుంచి ఆర్కే బీచ్ వరకు నేవీ హెలికాప్టర్, ఇవి కాకుండా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, మెరైన్ దళాలు గాలింపు చర్యలలో నిమగ్నమయ్యారు. మరోవైపు ఇంతమంది వెతుకుతున్నా ఎక్కడా జాడ దొరకకపోవటంతో కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ పాపను ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారేమోనని తండ్రి, బంధువులు అనుమానాలు వ్యక్తం చేశారు. అదితి డ్రైనేజ్‌లో పడిపోవటం ప్రత్యక్షంగా చూసిన సాక్షులు లేరు. ఘటనాస్థలంలో స్థానికులను విచారణ చేయగా ఎవరూ చూడలేదని చెప్పటంతో అనుమానాలు బలపడుతున్నాయి. ట్యూషన్నుంచి అదితిని ఇంటికి తీసుకురావటానికి వెళ్ళిన కారు డ్రైవర్ గుర్నాథాన్నికూడా విచారించారు. డ్రైవర్ కూతురుకూడా అక్కడే ట్యూషన్ చదువుతోంది. మరోవైపు పోలీసులు ఈ వ్యవహారాన్ని మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్నారు. అదితి తల్లిదండ్రులు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తుండగా పాప విశాఖలో తాతయ్య దగ్గర ఉంటోంది. విశాఖలో డ్రైనేజి వ్యవస్థ నిర్వహణపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.