బహుశః దేశంలో మరే ప్రతిపక్ష పార్టీ నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి చేసినన్ని దీక్షలు, ఓదార్పు యాత్రలు చేసి ఉండరేమో? అసలు ఓదార్పు యాత్రలని పరిచయం చేసిందే ఆయన కనుక దానిపై పేటెంట్ హక్కులు ఆయనకే ఉంటాయి. కానీ ఈ మధ్యన రాహుల్ గాంధీ కూడా జగన్ అనుమతి లేకుండా ఓదార్పు యాత్రలు చేసేస్తున్నారు. రాహుల్ గాంధీకి నడక అలవాటే కనుక ఓదార్పు యాత్రలు చేసేయగలుగుతున్నరేమో కానీ జగన్ లాగ నెలకొకసారి నిరాహార దీక్షలు పేరిట కడుపు మాడ్చుకోలేక ఆ దీక్షల జోలికి మాత్రం పోవడంలేదు. అందుకే జగనన్న దీక్షల మీదే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. అవి ఎంతగా అలవాటయిపోయాయంటే కనీసం నెలకొక దీక్షయినా చెయ్యనిదే ఉండలేని పరిస్థితి. కారణాలకేమి కొదవ లక్షా తొంబై ఉన్నాయి.
ఆ అలవాటు ప్రకారం ఈనెల 26నుండి గుంటూరులో ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు సిద్దం అయ్యారు. కానీ ఆయన అలాగ కడుపు మాడ్చుకొంటుంటే సహించలేక రాష్ట్ర ప్రభుత్వం ఆయన దీక్షని అడ్డుకొంది. కానీ జగన్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని అపార్ధం చేసుకొన్నారు. తమ నాయకుడు నిరవధిక నిరాహార దీక్ష చేస్తారని చెపుతుంటే, ప్రభుత్వం మాత్రం దానిని ఆమరణ నిరాహార దీక్ష అనడం ఏమీ బాగోలేదని వైకాపా నేతలు కూడా చాలా బాధపడ్డారు. కానీ ఏ పేరుతో దీక్ష చేసినా నాలుగయిదు రోజుల తరువాత పోలీసులు దానిని భగ్నం చేయడం ఇప్పుడు ఆనవాయితీగా మారిపోయింది కనుక ఏ పేరుపెట్టుకొన్నా అదేమీ దీక్షకు అడ్డుకాబోదని చెప్పవచ్చును.
హైకోర్టు అనుమతిచ్చే వరకు ఆగుతామని చెప్పిన వైకాపా నేతలు బహుశః జగన్ తొందరపెట్టడం వలననో ఏమో కానీ అంతవరకు ఆగకుండా మళ్ళీ ఆరోజు రాత్రే అక్టోబర్ 6వతేదీ నుండి జగన్ దీక్షకు ఆమరణ/నిరవధిక నిరాహార దీక్షకు కూర్చోబోతున్నట్లు ప్రకటించేశారు. కానీ ఈనెల ఒక్క దీక్ష కూడా చేయకపోవడంతో దీక్షా భంగం అవుతుందనుకొన్నారో ఏమో కానీ జగన్ టంగుటూరులో ఒక్కరోజు నిరాహార దీక్ష చేయబోతున్నట్లు ప్రకటించేశారు. పొగాకు రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా చేయబోతున్నారుట. కొన్ని రోజుల క్రితం ఆత్మహత్య చేసుకొన్న పొగాకు రైతుల కుటుంబాలను ఓదార్చిన తరువాత జగన్ దీక్షకు కూర్చోబోతున్నారు.
మూడు నాలుగు రోజుల క్రితమే కేంద్ర వాణిజ్య శాఖామంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా పొగాకు రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. వారి సమస్యలన్నిటినీ వీలయినంత త్వరలో తప్పకుండా తీర్చుతానని కనుక పొగాకు రైతులెవ్వరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆమె చేతులు జోడించి మరీ విజ్ఞప్తి చేసారు. ఆమె ఇచ్చిన హామీ పట్ల పొగాకు రైతులు సంతృప్తి వ్యక్తం చేసారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం సంతృప్తి చెందకపోవడంతో రైతుల కోసం దీక్షకి కూర్చోబోతున్నారు.