రాజకీయ దీపావళి ముందే వచ్చినట్లుంది. జాతీయస్థాయి పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పార్టీల సిద్ధాంతాలు, వాగ్దానాలమీద కాకుండా వ్యక్తిగత, కుటుంబ విషయాలపై టార్గెట్ చేసుకుని మాటలయుద్ధం సాగుతోంది. చివరకు ఇది ఎటు దారితీస్తుందో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడింది. సాంప్రదాయాలకు కట్టుబడ్డవారు నోరెళ్లబెడుతుంటే, పచ్చి వాగుడుకాయలకు మాత్రం ఇదో పండుగలా అనిపిస్తోంది.
అమెరికా పర్యటనలో మోదీ ప్రసంగిస్తూ, తన తల్లిచేసిన సేవలను గుర్తుతెచ్చుకుంటూ, తన చిన్నతనంలో తల్లి ఇరుగుపొరుగు ఇళ్లలో అంట్లుతోమేదనీ, నీళ్లు తోడేదని అనడం కాంగ్రెస్ శిబిరంలోనివారికి ఎగతాళి అయిపోయింది. అక్కడకు తమకేదో నిజానిజాలు తెలుసన్నట్టుగా, కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం మొదలుపెట్టారు. మోదీ పచ్చి అబద్దాలు చెబుతున్నాడనీ, మోదీ తల్లి అంట్లు తోమలేదని వాదించడం మొదలుపెట్టారు. వీరి నిఘానేత్రాలు మోదీ తల్లి అంట్లుతోమిందోలేదో ఎలా పసిగట్టాయో ఆ భగవంతునికే తెలియాలి.
సరే, కాంగ్రెస్ వాళ్లకు పనేమీలేదనుకుందాం. మరి అధికారపార్టీలో ఉన్న బీజేపీకి ఏమైందీ? బీజేపీ శిబిరం కూడా తమకేమీ పనిలేదన్నట్టుగా ప్రతివిమర్శలు, మాటకుమాట అనడంలో క్షణం ఆలస్యం చేయడంలేదు. తమ అగ్రనేత నరేంద్ర మోదీ ఒక పక్క అమెరికాను దున్నేస్తూ, విలక్షణమైన సమావేశాలతో డిజిటల్ ఇండియాకోసం తపిస్తుంటే, ఇక్కడ చోటా నాయకులు మాత్రం విమర్శలు, ప్రతివిమర్శలతో కాలంవెల్లబుచ్చుతున్నారు. కాంగ్రెస్ నాయకుడు ఆనంద్ శర్మ చేసిన వ్యాఖ్యలకు కమలనాభులు స్పందించకుండా ఉండలేకపోయారు. అమెరికావెళ్ళిన రాహుల్ అక్కడ ఏంచేస్తున్నారో, అసలెందుకు వెళ్ళారో చెప్పాలనీ కామెంట్ చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ వాళ్లకు మండింది. రాహుల్ గాంధీ ఎక్కడికైనా వెళ్లాలంటే అమిత్ షా , నరేంద్ర మోదీ పర్మిషన్ తీసుకుని వెళ్ళాలా? అంటూ ఘాటుగా స్పందించారు. ఎక్కడికైనా వెళ్ళే స్వేచ్ఛ కూడా మోదీపాలనలో పౌరులకు లేదా ?! అంటూ ఆనంద్ శర్మ బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు.
మరో పక్కన బీజేపీ నాయకుడు ఎం.జె. అక్బర్ మాటల తూటాలు పేలుస్తూ, `రాహుల్ ఓ పాడైపోయిన పిల్లాడు. ఆ మహాతల్లి తన కొడుకుని పాడుచేయడమే కాకుండా , ఇప్పుడు దేశాన్నే పాడుచేయాలని చూస్తోంది’ – అంటూ వ్యాఖ్యానించడంతో కాంగ్రెస్ నాయకులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో తల్లిమీద మోదీ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. అమెరికా పర్యటనలో మోదీ ఫేస్ బుక్ కార్యాలయంలోని టౌన్ హాల్ లో మాట్లాడుతూ, తాను రైల్వేస్టేషన్లలో టీ అమ్ముకునేవాడిననీ, అలాంటి వ్యక్తిని దేశ ప్రజలు ప్రధానిగా చేశారని అన్నారు. ఇదే సందర్బంలో ఆమె తన తల్లి పనిమనిషిగా ఉండేదన్న అంశం గుర్తుచేసుకున్నారు.మరో చోట మాట్లాడుతూ, యూపీఏ సర్కార్ అవినీతి పుట్టకావడంతోనే ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెప్పారనీ, అవినీతిలో సోనియా కుటంబసభ్యులందరికీ వాటా ఉన్నదని మోదీ అనడంతో కాంగ్రెస్ నాయకులకు కాలి మోదీ వ్యాఖ్యల్లోని నిజానిజాలు తవ్వడం మొదలుపెట్టారు. ఇది చివరకు మాటల యుద్ధానికి దారితీసింది. బిహార్ ఎన్నికల నేపథ్యంలో రాహుల్, మోదీ మధ్య మాటల యుద్ధం సాగుతుండటంతో అదే దారిన దిగువస్థాయి నాయకులు కూడా వెళుతున్నారు. ఆవు చేలో మోస్తుంటే, దూడ గట్టున ఉంటుందా? అగ్రనాయకుల ధోరణి మారనంతవరకూ ఈ మాటల యుద్ధాలు ఆగవు.
– కణ్వస