హైదరాబాద్: నారా లోకేష్ మొన్న చంద్రబాబునాయుడు కుటుంబంలోని సభ్యుల ఆస్తులను ప్రకటించిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు రు.42.4 లక్షలు, భువనేశ్వరికి రు.33 కోట్లు, తనకు రు.7.67 కోట్లు, తన భార్య బ్రాహ్మణికి రు.4.77 కోట్లు ఉన్నాయని లోకేష్ ఆ రోజు మీడియా సమావేశంలో తెలిపారు. ఇంతకంటే తమకు ఎక్కడైనా ఆస్తులు ఉన్నట్లు నిరూపిస్తే నిరూపించినవారికే ఆ ఆస్తులను రాసిస్తామని లోకేష్ సవాల్ విసిరారు. తాము ఐదేళ్ళనుంచి ఈ సవాల్ విసురుతున్నామని, ఎవరూ ఇంతవరకు ముందుకు రాలేదని గర్వంగా చెప్పారు. అయితే ఇవాళ ఒకరు ఆ సవాల్‌కు ప్రతిస్పందించారు. ఆమె మరెవరో కాదు. లోకేష్ తాత ఎన్టీఆర్‌కు రెండో భార్య అయిన లక్ష్మీ పార్వతి.
లోకేష్ విడుదల చేసిన ఆస్తుల జాబితాలో ప్రతిఒక్క ఆస్తికీ లోకేష్ కట్టిన విలువకు పక్కన అసలు విలువను పేర్కొంటూ లక్ష్మీ పార్వతి రూపొందించిన ఒక కొత్త జాబితాను సాక్షి పత్రిక ఇవాళ ప్రచురించింది. లోకేష్ అబద్ధాలలో తండ్రిని మించిపోయారని లక్ష్మీపార్వతి ఆరోపించారు. లోకేష్ చెప్పిన ప్రకారం కుటుంబం మొత్తం ఆస్తి దాదాపు రు.46.5 కోట్లు అని, అయితే వారికి హైదరాబాద్ శివార్లలోని మదీనాగూడలో ఉన్న పదెకరాల భూమి విలువే రు.200 కోట్లు పైనే ఉంటుందని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌లో చంద్రబాబు పేరుమీద ఉన్న ఇల్లు విలువను లోకేష్ రు.23.20 లక్షలుగా లెక్కగట్టగా, లక్ష్మీపార్వతి దానిని రు.32 కోట్లుగా లెక్కగట్టారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం ఉన్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంకూడా చంద్రబాబు కుటుంబంకిందే ఉందని తెలిపారు. చంద్రబాబు ఆస్తులపై దాదాపు దశాబ్దం క్రితమే తాను ఏసీబీకి తాను ఫిర్యాదు చేశానని, ఆ కేసును నీరుగార్చారని లక్ష్మీపార్వతి ఆరోపించారు.