2006, జూలై 11న ముంబై లోకల్ రైళ్ళలో జరిగిన వరుస బాంబు ప్రేలుళ్ళపై అప్పటి నుండి నడుస్తున్న కేసు విచారణ ఈరోజుతో ముగిసింది. ఈ కేసును విచారిస్తున్న ముంబై ప్రత్యేక కోర్టు ఈరోజు దోషులకు శిక్షలు ఖరారు చేసింది. మొత్తం 12 మందిని దోషులుగా గుర్తించిన కోర్టు వారిలో ఐదుగురికి ఉరి శిక్ష, మిగిలినవారికి యావజీవ కారాగార శిక్ష విధించింది. మహారాష్ట్ర ప్రభుత్వం తరపున వాదించిన ప్రాసిక్యూషన్ దోషులలో 8మందికి మరణశిక్ష విధించాలని వాదించినప్పటికీ కోర్టు కేవలం ఐదుగురుకే మరణశిక్ష విధించింది. దోషులందరూ క్షమించరాని అత్యంత హేయమయిన నేరానికి పాల్పడ్డారని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.
ఐదు వేర్వేరు లోకల్ రైళ్ళలో ఫస్ట్ క్లాస్ బోగీలలో బాంబులు అమర్చిన తీవ్రవాదులు 11 నిమిషాలలో వ్యవధిలో ఏడు ప్రేళ్ళులు జరిపారు. వాటిలో మొత్తం 188 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 800 మంది గాయపడ్డారు.
ప్రత్యేక కోర్టులో ఈ కేసు విచారణ ముగిసినప్పటికీ, శిక్షలు పడ్డవారందరూ మళ్ళీ ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించడం ఖాయం కనుక ఈ కేసు ఇంకా మరి కొన్నేళ్ళు కొనసాగవచ్చును. ఒకవేళ సుప్రీంకోర్టు కూడా ఉరి శిక్షపడ్డ వారికి అదే శిక్షలు ఖరారు చేసినట్లయితే, ఆ తరువాత వారు క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి దరఖాస్తు చేసుకోవడం, దానిపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడం మొదలయిన ప్రక్రియలన్నీ పూర్తవడానికి చాలా సమయం పట్టవచ్చును.