హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోడి మొన్న క్యాలిఫోర్నియాలో ఫేస్‌బుక్ ప్రధాన కార్యాలయానికి వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన అక్కడ చేసిన ప్రసంగంలో ఒక తప్పును కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా పట్టుకున్నారు. మోడి నాడు ఫేస్‌బుక్ కార్యాలయంలో మాట్లాడుతూ, తాను 2002లోనే గుజరాత్ ముఖ్యమంత్రిని కాకముందే సోషల్ మీడియాలో చేరానని, అప్పటికి తాను ముఖ్యమంత్రిని అవుతాననో, ప్రధానమంత్రిని అవుతాననో అనుకోలేదని, కేవలం ప్రపంచాన్ని తెలుసుకోవాలన్న ఆసక్తితోనే చేరానని చెప్పారు. ఈ వ్యాఖ్యలనే ఒమర్ పట్టుకున్నారు. సోషల్ మీడియాలో ప్రధాన వేదికలైన ఫేస్‌బుక్ 2004 సంవత్సరంలో, ట్విట్టర్ 2006లో ప్రారంభమయ్యాయని, మరి మోడి ఏ సోషల్ మీడియా వేదికలో చేరారో అని ఒమర్ ట్వీట్ చేశారు. ఒమర్ చెప్పింది 100% వాస్తవమే. ఫేస్‌బుక్ 2004 ఫిబ్రవరిలో, ట్విట్టర్ 2006 మార్చిలో కార్యకలాపాలు ప్రారంభించాయి.
మరోవైపు డిజిటల్ ఇండియా అంటూ ఊదరగొడుతున్న ప్రధాని నరేంద్రమోడితో కమ్యూనికేట్ చేయటానికి ఆయనకు అసలు ఒక అఫిషియల్ మెయిల్ ఐడీయే లేదని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ రౌండ్స్ కొడుతోంది.