ఈ శతాబ్దం ఇండియాదే అని నమ్మడానికి మొట్టమొదటి, బలమైన కారణం లభించింది. ఆర్థిక రంగంలో మన దేశం చిర స్మరణీయమైలు రాయిని అధిగమించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్.డి.ఐ.) ఆకర్షించడంలో డ్రాగన్ చైనాను, అగ్రరాజ్యం అమెరికాను అధిగమించింది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు ఆరు నెలల కాలంలో భారత్ నమ్మలేని విధంగా 31 బిలియన్ డాలర్ల ఎఫ్.డి.ఐ.లను ఆకర్షించింది. చైనా, అమెరికాలను వెనక్కి నెట్టింది. ఈ విషయంలో డ్రాగన్ లా ముందుండే చైనా ఇదే కాలంలో 28 బిలియన్ డాలర్లు ఆకర్షించింది. పెద్దన్న అమెరికా 27 బిలియన్ డాలర్లు ఆకర్షించింది.
ఆర్థిక రంగానికి సంబంధించిన వివరాలతో ఇంగ్లండ్ కు చెందిన ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక కథనాన్ని ప్రచురించింది. అందులో ఈ వివరాలను పొందుపరిచింది. గత ఏడాది భారత్ ఐదో స్థానంలో ఉంది. ఇప్పుడు నెంబర్ వన్ గా నిలిచింది. గత ఏడాది మొత్తం మీద 75 బిలియన్ డాలర్లు, 51 బిలియన్ డాలర్లతో చైనా, అమెరికాలు రెండో స్థానంలో ఉన్నాయి. ఇండియా 24 బిలియన్ డాలర్లతో ఐదో ర్యాంకు పొందింది. ఈ ఏడాది సగభాగంలో మాత్రం భారత్ తిరుగులేని వృద్ధిని సాధించింది. ఇదే ట్రెండ్ కొనసాగితే ఈ ఏడాదికి ఎఫ్ డి ఐ చాంపియన్ భారత్ అవుతుందంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు.
మేకిన్ ఇండియాలో భాగంగా విదేశీ పెట్టుబడుల కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మోడీ విదేశీ పర్యటనలపై కాంగ్రెస్ విమర్శలు చేస్తున్నా, ఆ పర్యటనల ప్రభావం ఎఫ్ డి ఐ లను ఆకర్షించడంలో స్పష్టంగా కనిపిస్తోంది. సంపన్న దేశాలు ఇప్పుడు ఎంతో నమ్మకంగా భారత్ వైపు చూస్తున్నాయి. భారత్ లో ఉన్న అపారమైన అవకాశాలను వివరించడంలో మోడీ సఫమయ్యారు. దీంతో బడా కార్పొరేట్ కంపెనీలు భారత్ కు వస్తున్నాయి. తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఫలిస్తోందని, దేశం ఇలాగే మరింత ప్రగతిని సాధిస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సంతోషంగా కామెంట్ ను ట్వీట్ చేశారు. అయితే, దేశీయ ఆర్థిక వేత్తలు మాత్రం, పెట్టుబడులను ఆకర్శిస్తున్న స్థాయిలో ఉఫాధి అవకాశాలను పెంచాలని సూచిస్తున్నారు.