సుప్రసిద్ధ టీవీ చానల్ చాలా ఘా…ట్టిగా నాలుక కర్చుకుంది. ప్రియాంక చోప్రా నటించిన అమెరికన్ సీరియల్ క్వాంటికో లాంచింగ్ సందర్భంగా ఏబీసీ చానల్ ఒక ప్రోమోను ప్రదర్శించింది. ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్ కిరీటాన్ని ధరించే దృశ్యాలు చూపించాలనేది సదరు చానల్ వారి సదుద్దేశం. కానీ, ఎక్కడ పొరపాటు జరిగిందో గానీ యుక్తా ముఖీ దృశ్యాలు చూపించారు. అయితే యుక్తా ముఖీ మన దేశంలోనే పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. అయినా మనిషి మారిన విషయాన్ని ఏబీసీ వారు చాలా సేపు గుర్తించలేదు.
చివరకు తప్పు తెలుసుకుని లెంపలేసుకున్నారు. ప్రియాంకను గుర్తుపట్టడంలో పొరపాటు వల్ల యుక్తా ముఖి దృశ్యాలను చూపించామని, ఇది ఉద్దేశ పూర్వకంగా జరిగింది కాదని ఏబీసీ చానల్ వారు సవినయంగా వివరణ ఇచ్చి నాలుక కరుచుకున్నారు. ప్రియాంక నటించిన సీరియల్ మొదటి ఎపిసోడ్ మొన్న ఆదివారం రాత్రి ప్రసారమైంది. దీనిపై రియాక్షన్స్ వగైరాలను ఏబీసీ ప్రసారం చేసింది. ఈ సందర్భంగా ఒక ప్రోమోలో ఈ తప్పు దొర్లింది.
బాలీవుడ్ నుంచి అమెరికా సీరియల్ స్థాయికి వెళ్లిన ప్రియాంక, అసలు ఇందులో నటించాలా వద్దా అని మొదట్లో అనుమానించిందట. సీరియల్ ను ఒప్పుకొనే ముందు చాలా ఆలోచించిందట. చివరకు ఏమైతేనేం ధైర్యం చేసి ఓకే చెప్పింది. ఇందులో కొన్ని రొమాన్స్ సీన్లలో నటించడం చాలా కష్టంగా అనిపించిందని ప్రియాంక ఇప్పటికే చాలా మంది ఫ్రెండ్స్ కు చెప్పుకొంది.