ఉత్తరప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు అక్కడి గ్రామ ప్రజల్లో వైషమ్యాగ్నిని రగిలిస్తున్నాయి. అన్ని మతాలవారూ హాయిగా కలిసి జీవించే అతిప్రధానమైన లక్షణం కనుమరుగయ్యే ప్రమాదం ముంచుకొచ్చింది. అందుకు తాజా ఉదాహరణ దాద్రికి చేరువలోఉన్న ఒక గ్రామంలో ఉన్నట్టుండి ఆవుమాంసం గొడవ చోటుచేసుకోవడమే. అది చినికిచినికి గాలివానగా మారింది. ఉత్తరప్రదేశ్ లో గోవధ, ఆవుమాంసం తినడంపై నిషేధం అమల్లోఉంది. దాన్ని అడ్డంపెట్టుకుని ఓట్లు గుంజుకునే ప్రయత్నం జరుగుతోంది. దీంతో ఒక అమానుష దాడికి రంగం సిద్దంచేశారు. ఫలితంగా, ఆ గ్రామానికి చెందిన 50ఏళ్ల వ్యక్తి ఆవుని చంపి మాంసం తిన్నారన్న ఆరోపణ ఎదుర్కోవాల్సివచ్చింది. అంతే, ఉన్నట్టుండి వారి ఇంటిపై 200మంది మూకుమ్మడిగా దాడిచేశారు. ఇంటిని ధ్వంసం చేశారు. ఇంటిపెద్దను కొట్టి చంపారు. అతని కుమారుడికి తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రిలో ఇతను చావుబతుకులమధ్య ఉన్నాడు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే గ్రామంలో ఇప్పుడు పోలీస్ బూట్ల శబ్దం వినిపిస్తోంది.
మతం – రాజకీయం
ఈ సంఘటన పైకి చూసినప్పుడు ఆవుపట్ల హిందువులకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసినందుకే దాడి జరిగినట్లు అనిపించవచ్చు. కానీ దీనివెనుక రాజకీయ ప్రయోజనాలు, రాబోయే ఎన్నికల వ్యూహాలు లేవని చెప్పలేం. ఉత్తరప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు మరికొద్ది రోజుల్లోనే (అక్టోబర్ 9 నుంచి నాలుగువిడుతలుగా) జరగబోతున్నాయి. నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచీ పల్లెల్లో ప్రశాంతవాతావరణం దెబ్బతింటోంది. దాద్రి వద్ద జరిగిన దారుణ దాడి సంఘటన వెనుక ఆవుమాంసం అన్నది కేవలం ఒక పావు కావచ్చు. కాగా పరిస్థితి చేయిదాటిపోవడంతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నిందితులను పట్టుకోవాలంటూ కఠిన ఆదేశాలు జారీచేశారు. బాధిత కుటుంబానికి పదిలక్షల పరిహారం ప్రకటించారు. కేంద్రమంత్రి మహేష్ శర్మ ఈ సంఘటనపై స్పందిస్తూ – ఇది చాలా బాధాకరం. అవగాహనాలోపం వల్లనే ఇలా జరిగిఉంటుంది. పంచాయతీ ఎన్నికలు కూడా ఒక కారణం కావచ్చు… అంటూ చెప్పుకొచ్చారు. ఇరు వర్గాల వారిని కూర్చోబెట్టి వారి మధ్య సామరస్యాన్ని పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
ఈ గ్రామం ఇలాంటి దారుణకృత్యాలను మునుపెన్నడూ చూడలేదు. చాలా సామరస్యంగా ఉండేవారు. హిందువుల పండుగలు, వేడుకలప్పుడు ముస్లీం మిత్రులు వచ్చేవారు. అలాగే మొన్ననే జరిగిన బక్రీద్ వేడుకల విందులో కూడా హిందువులు పాల్గొన్నారు. ఇరు వర్గాల వారు ఎన్నడూ హింసాత్మక సంఘటనలకు దిగిన దాఖలాలు లేవు. అలాంటిది ఇప్పుడు ఉన్నట్టుండి ఆవుమాంసాన్ని అడ్డుపెట్టుకుని దాడులకు దిగడం ఖచ్చితంగా మతపరంగా ఓట్లు చీల్చేప్రయత్నమే.
మాయమవుతున్న ఆవులు
అయితే ఈ మధ్య గ్రామంలో జరిగిన కొన్ని సంఘటనలు కాస్తంత ఆలోచించే రీతిలోనే సాగాయి. ఆవులు, మేకలు వంటి జంతువులు మాయవడం ప్రారంభమైంది. చాలా రహస్యంగా జంతువధ జరుగుతున్నట్టు కూడా గ్రామస్థులు గుసగుసలాడుతున్నారు. ఇంతలో ఈ సంఘటన చోటుచేసుకుంది. సెప్టెంబర్ 16న ఆవుదూడ తప్పిపోయినట్లు చెప్పుకున్నారు. సెప్టెంబర్ 28 మధ్యాహ్నం ముస్లీంమతస్థులు నివసిస్తున్న ఒక ఇంటికి చేరువలోని పొలంలో ఆ దూడతిరగాడటం కొంతమంది చూశారట. ఆ తర్వాత ఒక పాలిథిన్ బ్యాగ్ లో ఆ ఇంటి పెద్ద మాంసాన్ని ఇంటికి తీసుకువెళ్లడం, అతడ్ని కుక్కలు వెంటాడం మరికొంతమంది చూశారట. దీంతో రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. కానీ ఇవన్నీ నిజమేనా…
అసలేం జరిగింది ?
సోమవారం (సెప్టెంబర్ 28) రాత్రిపూట ఆ గ్రామంలోని ఆలయం నుంచి ఒక ప్రకటన వెలువడింది. అదేమంటే తమ ఊరిలోని మహమ్మద్ అఖ్ లఖ్ కుటుంబం ఆవుమాంసం తిన్నారన్నది ఆ ప్రకటన సారాంశం. ఆ తర్వాత కొద్దిసేపటికే తమ ఇంటిపై పెద్ద దాడి జరుగుతుందని ఆ కుటుంబానికి తెలియదు. ఉన్నట్టుండి పెద్ద గుంపు దాడికి దిగింది. ఇంటిని ధ్వసం చేసింది. ఇంటిపెద్దను చితక్కొట్టారు. అతని కుమారుడు (22ఏళ్లు) అడ్డం వెళితే అతణ్ణీ కొట్టారు. తండ్రి మృత్యువాతపడ్డారు. కొడుకు తీవ్రగాయాలతో నోయిడా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. అతని చెల్లెలు 18ఏళ్ల సజిదా కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. `ఆవుమాంసం తినలేదని నిరూపించబడితే ఇప్పుడు మా తండ్రిని మాకిచ్చేస్తారా?’ అంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు. `తండ్రిని కోల్పోయాను. ఇప్పుడు నా సోదరుడ్ని కోల్పోదలచుకోలేదు. ప్లీజ్ అతణ్ణి బ్రతికించండి’ అంటూ వేడుకుంటోంది సజిదా.
దాడికిపాల్పడినవారు ఇటుకరాళ్లను తీసుకుని దాడికి దిగినట్లు తెలుస్తోంది. ఆ ఇంట్లో ఇటుక ముక్కలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. రక్తపు మరకలున్న తండ్రి దుస్తులు అక్కడ పడిఉండటాన్ని సజిదా మీడియావాళ్లకు చూపించారు. మరో గదిలో ఉన్న ఫ్రిజ్ ని విరగ్గొట్టారు. దాన్ని తల్లక్రిందులుగా పడేశారు. విసిరికొట్టిన అద్దం మరోపక్కన మూలగా పడిఉంది. మహమ్మద్ అఖ్ లఖ్ ని ఇంట్లోనుంచి కొట్టుకుంటూ బయటకు ఈడ్చుకుపోయారు. అక్కడ చివరిశ్వాస విడిచేవరకు చితకబాదారు. ఇదంతా జరిగిన తర్వాత రాత్రి పదిన్నర గంటలకు పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈలోగా దాడికిదిగిన వర్గంవారు పలాయనం చిత్తగించారు. ఇప్పుడు గ్రామం పోలీస్ నీడలో ఉంది. పోలీస్ బందోబస్తు మధ్య మహమ్మద్ అఖ్ లఖ్ అంత్యక్రియలు జరిగాయి. ఇరువర్గాల మధ్య సామరస్య వాతావరణం నెలకొల్పడానికి పోలీస్ అధికారులు ప్రయత్నిస్తున్నారు
అయితే, అనేక కథనాలు వినిపిస్తున్నా, పంచాయతీ ఎన్నికలు దగ్గరపడటంతోనే గ్రామంలో కుట్రలు, కక్ష్యలు చెలరేగుతున్నాయన్న వాదనను త్రోసిపుచ్చలేం. ఆవుమాంసాన్ని కూడా ఎన్నికల లబ్దికి వాడుకునేటంతగా రాజకీయ కుళ్లు పెరిగిపోవడం అత్యంత దురదృష్టకరం.
– కణ్వస