పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఐక్యరాజ్యసమితి సమావేశంలో షరా మామూలుగానే కాశ్మీర్ అంశం ప్రస్తావించి, ఆ సమస్య పరిష్కారానికి నాలుగు సూచనలు చేసారు. వాటిలో కాశ్మీర్, సియాచిన్ ప్రాంతాల నుండి భారత సేనలను ఉపసంహరించడం, కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉండటం, బెదిరింపులు మానుకోవడం. కాశ్మీర్, సియాచిన్ ప్రాంతాల నుండి భారత్ తన సనియాన్ని ఉపసంహరించుకొంటే ఏమవుతుందో తేలికగానే ఊహించవచ్చును. భారత సైనికులు తమ ప్రాణాలు పణంగాపెట్టి కాపలా కాస్తుంటేనే వారి కళ్ళు గప్పి అవసరమయితే వారి ప్రాణాలు తీసి పాక్ ఉగ్రవాదులను భారత్ లోకి ప్రవేశ పెడుతోంది పాకిస్తాన్. ఇక సైన్యమే లేకపోతే ఇక చెప్పుకోనవసరం లేదు. ఇరు దేశాల మధ్య కార్గిల్ కంటే భీకరమయిన మరో యుద్ధం జరిగినా ఆశ్చర్యం లేదు.
ఒకపక్క చర్చలు జరుపుతూనే మరోపక్క సరిహద్దులలో యదావిధిగా కాల్పులు జరిపే పాకిస్తాన్ కాల్పుల విరమణ గురించి మాట్లాడటం చాల విడ్డూరంగా ఉంది. ఇక అణు బాంబులతో దాడి చేసి దశాబ్దాల పాటు గుర్తుండిపోయే విధంగా భారత్ కి తగిన గుణపాఠం చెపుతామని బెదిరించింది పాకిస్తానే తప్ప భారత్ కాదు. చేయవలసినవి అన్నీ చేసి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత్ పై ఆరోపణలు చేయడం, శాంతి ప్రతిపాదనలు చేయడం. కేవలం చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని నీతులు చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది.
దానికి భారత్ కూడా చాలా ధీటుగా…చాలా ఘాటుగా జవాబిచ్చింది. భారత్ నుండి అటువంటి సమాధానం వస్తుందని ఊహించలేని పాకిస్తాన్ షాక్ అయ్యి ఉండవచ్చును.
భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ఈ విధంగా ట్వీట్ చేసారు.
కాశ్మీర్ ని మిలటరీ రహితంగా చేయడం ఈ సమస్యకు సరయిన సమాధానం కాదు. పాకిస్తాన్ దేశాన్ని ఉగ్రవాద రహిత దేశంగా చేయడమే అందుకు సరయిన మార్గం.
పాకిస్తాన్ దేశంలో నెలకొన్న అస్థిరతకు కారణం ఆ దేశంలో ఉగ్రవాదులనుతయారు చేస్తుండటమే. లోపం తనలో ఉంచుకొని పొరుగు దేశాన్ని నిందించడం వలన ఏమీ ప్రయోజనం లేదు.
ఉగ్రవాదానికి పాకిస్తాన్ బలవుతోందనే వాదన అర్ధరహితం. దాని సిద్దాంతాలు, విధానలకే అది మూల్యం చెల్లించుకొంటోంది. నిజానికి పాకిస్తాన్ దేశమే ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేస్తోంది, అని ట్వీట్ చేసారు.
ఇంతకు ముందు కూడా పాకిస్తాన్ కాశ్మీర్ సమస్యను ఐక్యరాజ్య సమితిలో లేవనేత్తినప్పుడు భారత్ ప్రభుత్వం దానిని మొక్కుబడిగా ఖండిస్తూ ఉండేది కానీ ఏనాడూ పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుండి పాకిస్తాన్ ఖాళీ చేయాలని ఈవిధంగా గట్టిగా కోరలేదు. అంతే కాదు పాకిస్తాన్ దేశమే ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి ప్రపంచంలో అశాంతి సృష్టిస్తోందని భారత్ నేరుగా ఆరోపణలు చేయలేదు. కానీ మోడీ ప్రభుత్వం ఆ మాటను కుండ బ్రద్దలుకొట్టినట్లు ఇప్పుడు చెప్పింది. పాకిస్తాన్ దేశాన్ని ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టి చూపుతోంది. అంతే కాదు భారత్, పాకిస్తాన్ దేశాలకు ఒకే సారి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ పాకిస్తాన్ నేటికీ ఎందుకు వెనుకబడి ఉందో కూడా విస్పష్టంగా చెప్పింది.
పాకిస్తాన్ పట్ల ఇదివరకులా తమ ప్రభుత్వం మెతక వైఖరి అవలంభించదని మోడీ అధికారంలోకి వచ్చిన వెంటనే విస్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ ఆయన కూడా పాకిస్తాన్ తో స్నేహానికే మొదట ప్రాధాన్యం ఇచ్చేరు. కనీ మోడీ హెచ్చరికలను లైట్ గా తీసుకొన్న పాకిస్తాన్ అలవాటు ప్రకారం వ్యవహరిస్తూ భంగపడింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ ముందు నవాజ్ సహరీఫ్ తీసికట్టేనని పాక్ మీడియా చెప్పింది. భారత్ విదేశీ విధానాలతో పోలిస్తే పాక్ విధానాలు చాలా డొల్లగా ఉన్నాయని పాక్ మీడియా చెప్పింది. భారత్ కూడా ఇప్పుడు అదే నిరూపించి చూపుతోంది. కనుక ఇప్పటికయినా పాకిస్తాన్ తన వైఖరిని మార్చుకోగలిగితే దానికే మంచిది. లేకపోతే పాక్ ప్రజలే తీవ్రంగా నష్టపోక తప్పదు.